సంచలనం: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ అరెస్ట్! రూ.18 కోట్లు దుర్వినియోగం ఆరోపణలు…

tv9-former-ceo-raviprakash-arrest
- Advertisement -

హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్‌ను శనివారం బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతోపాటు మాజీ సీఎఫ్‌ఓ మూర్తిని కూడా వారు అదుపులోకి తీసుకున్నారు. వీరిని బంజారాహిల్స్ పోలీస్ ‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణపై తాజాగా ఆయనను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. 

శనివారం ఉదయం పది మంది పోలీసుల బృందం రవిప్రకాశ్ ఇంటికి వచ్చిందని, కారణం చెప్పకుండానే ఆయన్ని వారు అదుపులోకి తీసుకున్నారని, ఎందుకు అరెస్టు చేస్తున్నారో, ఏ సెక్షన్ కింద అరెస్టు చేస్తున్నారో కూడా చెప్పకుండా ఆయన్ని తీసుకుని వెళ్లిపోయారని రవిప్రకాశ్ సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

టీవీ9కు చెందిన నిధులు దుర్వినియోగం చేశారని, సంస్థకు చెందిన లోగోలను మోజో టీవీకి విక్రయించారని మాజీ సీఈవో రవిప్రకాశ్ తదితరులపై ఇప్పటికే టీవీ9 కొత్త యాజమాన్యం అలంద మీడియా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వాటిని ఆధారంగా చేసుకుని రవిప్రకాశ్ తదితరులపై పోలీసులు ఐపీసీ 457, 420, 409, 406, 20(బి) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

రవిప్రకాశ్‌, ఎంవీకేఎన్‌ మూర్తి, హరికిరణ్‌ చేరెడ్డి కలిసి టీవీ9 లోగోలను మోజోటీవీ యాజమాన్య సంస్థ మీడియా నెక్ట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు కేవలం రూ.99 వేలకు అమ్మేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే సంస్థ వాటాలను గరుడపురాణం శివాజీకి అక్రమంగా వినియోగించారనే అభియోగాలు కూడా ఉన్నాయి. 

టీవీ9 తెలుగు లోగోతో పాటు మొత్తం ఆరు లోగోలను రవిప్రకాశ్ తన సొంత చానల్ మోజో టీవీకి అక్రమంగా బదిలీ చేశారని ఆరోపిస్తూ ఏబీసీపీఎల్‌ డైరెక్టర్‌ కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి గతంలో రవిప్రకాశ్‌ను పోలీసులు పలుమార్లు విచారించారు. 

ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో చుక్కెదురు…

తనపై దాఖలైన కేసులకు సంబంధించి రవిప్రకాశ్ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా హైకోర్టులో ఆయనకు చుక్కెదురైంది. ముందస్తు బెయిల్‌లో ఉన్న నిబంధనలను తొలగించాలంటూ రవిప్రకాశ్ పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.

పోలీస్ స్టేషన్‌కు హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలని, అలాగే విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన హైకోర్టును అభ్యర్థించారు. అయితే ఆయన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.

తెరపైకి మరో కొత్త వ్యవహారం…?

ఒకవైపు అలందా మీడియా ఫిర్యాదులపై నమోదు చేసిన కేసులు విచారణలో ఉండగా.. మరోవైపు ఓ కొత్త వ్యవహారం తెర మీదకు వచ్చినట్లుగా తెలుస్తోంది. సంస్థ డైరెక్టర్లకు తెలియకుండా దాదాపు రూ. 18 కోట్లను రవిప్రకాశ్ దుర్వినియోగం చేశారనేది ఆయన మీద తాజా ఆరోపణ.

ఆ నిధులను తన బినామీ మీడియా సంస్థలను బదిలీ చేశారనే అభియోగం కొత్తగా దాఖలైంది. సంస్థ డైరెక్టర్లకు తెలియకుండా నిధులు ఎలా మళ్లిస్తారంటూ ప్రస్తుత యాజమాన్యం అలంద మీడియా ఆయన మీద పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం దీని పైనే పోలీసులు రవిప్రకాశ్‌ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తంమీద ఫోర్జరీ, తప్పుడు పత్రాల సృష్టి, లోగోల విక్రయం, సైబర్‌క్రైమ్‌ నేరాలు తదితర ఆరోపణలపై రవిప్రకాశ్ అండ్ కో పైన పోలీసులు కేసులు నమోదు చేయగా.. మొదట్లో తప్పించుకుని తిరిగిన రవిప్రకాశ్ చివరికి పోలీసులకు లొంగిపోయారు.  ఈ కేసులకు సంబంధించి విచారణకు హాజరై.. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

మరోవైపు తన మీద నమోదైన కేసుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం రవిప్రకాశ్ దరఖాస్తు చేశారు. ఆ తరువాత అసలేం జరిగిందో తెలియజేస్తూ.. వీడియా సందేశాల ద్వారా వివరించిన ఆయన.. తన భవిష్యత్ ప్రణాళికలను కూడా తెలిపారు. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి పోలీసులు ఆయన్ని అరెస్టు చేయడంతో రవిప్రకాశ్ వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్లయింది. 

జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు…

రవి ప్రకాశ్‌ను రాత్రి వరకు విచారించిన పోలీసులు అనంతరం ఆయన్ని నాంపల్లి కోర్టులో హాజరు పరచగా.. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం రవిప్రకాశ్‌ను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోవైపు రవిప్రకాశ్ తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, ఈ పిటిషన్‌పై ఈ నెల 9న వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు. 

- Advertisement -