ఓటుకు నోటు కేసు: వేం నరేందర్ రెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం

interrogationon vem Narender reddy
- Advertisement -

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్‌ నేత వేం నరేందర్‌రెడ్డి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. నరేందర్‌రెడ్డితో పాటు ఆయన కుమారుడు కృష్ణ కీర్తన్‌రెడ్డిని మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

బ్యాంక్‌ అకౌంట్స్‌ ముందు ఉంచి మరీ.. రూ. 50 లక్షలతో పాటు ఇవ్వజూపిన మరో నాలుగున్నర కోట్లు ఎక్కడ అంటూ నరేందర్‌ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. ఆదాయ పన్ను, అవినీతి నిరోధక శాఖ ఇచ్చిన సమాచారంతో ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాజ్‌ శేఖర్‌ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతోంది.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్‌రెడ్డిని గెలిపించేందుకు నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు లచం ఇవ్వజూపారన్నది అభియోగం. అవినీతి నిరోధకశాఖ అధికారులు దాఖలు చేసిన అభియోగపత్రం ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈకేసులో రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్‌, ఉదయ్‌కుమార్‌లను నిందితులుగా ఏసీబీ పేర్కొంది. స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన రూ.50లక్షలు ఎక్కడి నుంచి తెచ్చారని ఈడీ అధికారులు నరేందర్‌రెడ్డి, కృష్ణ కీర్తన్‌లను ప్రశ్నిస్తున్నారు. కాగా, ఓటుకు నోటు కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేననే ఆరోపణలు కూడా ఉన్నాయి.

- Advertisement -