కాంగ్రెస్ కలెక్టరేట్ల ముట్టడి: పలు చోట్ల ఉద్రిక్తతలు, విజయశాంతి అరెస్ట్!

5:21 pm, Thu, 25 April 19
vijayashanthi-arrest-in-warangal-collectorate

వరంగల్: కాంగ్రెస్ పార్టీ గురువారం చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వరంగల్‌లో ఆ పార్టీ నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి కూడా పాల్గొనగా, ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

విజయశాంతితోపాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, కొండేటి శ్రీధర్‌లను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ముట్టడి సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. ఇంటర్ ఫలితాలలో అవకతవకలు జరిగి 5 రోజులు గడిచినా దొర మాత్రం ఎమ్మెల్యేలను కొనే బిజీలో ఉన్నారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు.

 

‘‘ఇరవై మంది విద్యార్థులు చనిపోయినా చలనం లేదా దొర.. ఇక నీ ఆటలు సాగవు..’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల మరణాలు చాలా బాధాకరమన్నారు. విద్యార్థులు అధైర్య పడరాదని, వారికి అండగా తామంతా ఉన్నామని చెప్పారు. ఇంటర్‌ విద్యార్ధుల కోసం ఉద్యమిస్తామని రాములమ్మ హామీ ఇచ్చారు.

ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళంపై తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద కాంగ్రెస్‌ నేతలు, కార‍్యకర్తలు ఈ మేరకు నిరసనలు చేపడుతున్నారు. హైదరాబాద్‌లో అయితే జనసేన ఏకంగా ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించడం గమనార్హం.

చదవండి:  ఏపీ సీఎస్‌పై మండిపడ్డ యామిని! ‘‘వైసీపీ నేతలను ప్రజలే తరిమికొడతారు..’’