కేసీఆర్.. ఏపీ పాలిట విలన్: పవన్ కళ్యాణ్‌‌‌పై విజయశాంతి ప్రశంసలు

2:53 pm, Sat, 16 March 19
vijayashanthi praises Pawan Kalyan, Newsxpressonline

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత విజయశాంతి మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ పాలిట విలన్‌గా మారారని కేసీఆర్‌పై ఆమె మండిపడ్డారు. తెలంగాణ సీఎంకు ఆంధ్రా రాజకీయాల్లో ఏం పని అని రాములమ్మ ప్రశ్నించారు.

కేసీఆర్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవి కావని.. ఆంధ్రుల మనోవేదనగా భావించాలని ఆమె అన్నారు. ఏపీ రాజకీయాల్లో కలగజేసుకోవద్దని పవన్ కళ్యాన్ చేసిన హెచ్చరికతో ప్రతి ఆంధ్రుడూ ఏకీభవిస్తాడని విజయశాంతి వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్‌పై ప్రశంసలు….

బీజేపీకి బినామీగా ఏపీ రాజకీయాల్లో ప్రవేశించాలని చూస్తున్న కేసీఆర్‌ను అక్కడి ప్రజలు అంగీకరించరని ఆమె పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం.. ఏపీ ప్రజలందరి అంతరంగాలను ఆవిష్కరించేలా సాగిందని అన్నారు.

అంతేగాక, పవన్ కళ్యాణ్ తెలివైన వారని, ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ వేసిన ఉచ్చులో పడకుండా తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని ప్రశంసించారు. ఓ వైపు కేసీఆర్‌ను విమర్శిస్తూనే.. పవన్ కళ్యాణ్ పై విజయశాంతి ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది.