నమ్మించి గొంతుకోశారు: కేసీఆర్‌పై మాజీ ఎంపీ వివేక్ తీవ్ర విమర్శలు

5:28 pm, Sat, 23 March 19
Vivek comments on KCR Latest News, KCR Updates news, Telangana Political News, Newsxpressonline

హైదరాబాద్: తనకు పెద్దపల్లి లోక్‌సభ టికెట్ కేటాయించకపోవడంపై టీఆర్ఎస్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు వివేక్. దళితుడినైనందునే తనను కేసీఆర్ చిన్న చూపు చూస్తున్నారని, నమ్మించి గొంతుకోస్తారనుకోలేదని విమర్శించారు.

కేసీఆర్ మాట తప్పారు..

శనివారం వివేక్ మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమకారుడినైన తనకు సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చాకే తాను టీఆర్ఎస్‌లో చేరానని చెప్పారు. కానీ, తనకు పార్టీలో గుర్తింపు లేదని వాపోయారు. పెద్దపల్లి ఎంపీ టికెట్ ఉద్యమకారుడికి ఇస్తానని కరీంనగర్ సభలో కేసీఆర్ చెప్పారని వివేక్ గుర్తు చేశారు.

పెద్దపల్లి జిల్లాకు వెంకటస్వామి జిల్లాగా పేరు పెడతామని చెప్పిన కేసీఆర్.. మాట తప్పారని అన్నారు. తాను మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. పెద్దపల్లి పరిధిలో టీఆర్ఎస్ పార్టీకి జీవం పోసింది తానేనని చెప్పారు. తన పేరు ఎంపీ అభ్యర్థుల జాబితాలో లేకపోవడం బాధాకరమని వివేక్ అన్నారు.

తాను టీఆర్ఎస్‌లో ఎవరినీ మోసం చేయలేదని వివేక్ అన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు తనపై తప్పుడు సమాచారం ఇచ్చారని, శాసనసభ ఎన్నికల్లో తాను టీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని వివేక్ స్పష్టం చేశారు.

తనకు టికెట్ లభించినా లేకున్నా పెద్దపల్లి ప్రజలతోనే ఉంటానని ఆయన అన్నారు. తనకు ఇతర పార్టీల నుంచి ఆహ్వానం ఉందని, శనివారం సాయంత్రం మంచిర్యాలలో అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వివేక్ తెలిపారు. కాగా, వివేక్ బీజేపీలో చేరతారనే ప్రచారం కూడా జరుగుతోంది.

చదవండి: ‘అంత సత్తా ఉంటే..’, కేసీఆర్‌కు.. పవన్ కళ్యాణ్ సవాల్! బాబుకు ఇక రిటైర్మెంటేనంటూ…