కోర్టుల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు సూచనలు.. 3 విడతల్లో పాటించాల్సిన నిబంధనలు…

- Advertisement -

హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం నుంచి కరోనా కేసులు అధికంగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కోర్టుల కార్యకలాపాలు తిరిగి మొదలయ్యాయి. 

హైదరాబాద్‌లోని సిటీ సివిల్‌ కోర్టు, నాంపల్లి క్రిమినల్‌ కోర్టులు, సిటీ స్మాల్‌కాజెస్‌ కోర్టు, సీబీఐ కోర్టు, రంగారెడ్డి జిల్లాలో ప్రధాన కోర్టులు మాత్రం తెరుచుకోలేదు. ఇవి ఈ నెల 28 వరకు పని చేయవు.

- Advertisement -

ఈ నెల 15 నుంచి 30 వరకు తొలి విడత, జులై 1 నుంచి 15 వరకు రెండో విడత, జులై 16 నుంచి ఆగస్టు 7 వరకు మూడో విడత, ఆగస్టు 8 నుంచి మరో విడతగా కోర్టులను ఇప్పటికే హైకోర్టు విభజించింది.

తొలి విడతలో 20 కేసులు, రెండో విడతలో 40, మూడో విడతలో 60 కేసుల వరకు జడ్జిలు విచారణ చేయవచ్చని తెలిపిన హైకోర్టు.. ప్రతి 15 రోజులకు ఒకసారి పరిస్థితిపై సమీక్ష నిర్వహించాలని సూచించింది. 

సాధారణ సూచనలు…

* ఉదయం 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటలకు కోర్టు ఆవరణను క్రిమిరహితంగా శుభ్రం చేయాలి.
* ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి. మాస్కులు లేని వారిని కోర్టు ప్రాంగణంలోకి అనుమతించకూడదు.
* కోర్టు ప్రాంగణంలో కరోనా నిబంధనలపై సూచనలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయాలి.
* ప్రవేశం వద్ద న్యాయాధికారితో సహా అందరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించాలి. కోర్టులో అందుబాటు ప్రాంతాల్లో శానిటైజర్లు ఉంచాలి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత దూరం పాటించాలి.
* దగ్గు, జ్వరం తదితర లక్షణాలున్న వారిని కోర్టు ప్రాంగణంలోకి అనుమతించరు. ఎవరికైనా అలాంటి లక్షణాలుంటే వెంటనే వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి నోడల్‌ అధికారికి సమాచారం అందించాలి.
* కోర్టు ఆవరణ శుభ్రతలో జిల్లా జడ్జి నియమించిన నోడల్‌ అధికారి బాధ్యత వహించాలి.
* తాజా ఫైలింగ్‌, దరఖాస్తులు, కోర్టు ఫీ చెల్లింపులు తదితరాలకు కోర్టు ప్రవేశ ద్వారం సమీపంలో ఓ పక్కన విభాగం ఏర్పాటు చేయాలి. తద్వారా కోర్టు ఆవరణల్లో రద్దీ తగ్గుతుంది. పరిశీలన అయ్యాక కక్షిదారుల ఫోన్‌లకు మెసేజ్‌ల రూపంలో సమాచారం అందించాలి.
* కేసుల జాబితా ప్రకారం వెళ్లడానికి వీలుగా న్యాయవాదులకు వెయిటింగ్‌ హాలు ఏర్పాటు చేయాలి. అందులో కేసుల వివరాలను తెలిపే డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలి. కుర్చీల మధ్య 3 అడుగుల దూరం ఉండాలి.
* జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, కోర్టు మేనేజర్‌, న్యాయవాదులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి ఈ-ఫైలింగ్‌, వీడియో కాన్ఫరెన్స్‌ విధానం, సాక్షుల వాంగ్మూలం నమోదుపై అవకాశాలను పరిశీలించాలి.
* విచారణకు హాజరు కాలేమని పార్టీలు విజ్ఞప్తి చేసినపుడు న్యాయాధికారులు కఠినంగా వ్యవహరించకూడదు. వారెంట్లు జారీ చేయడం వంటివి చేయకూడదు. ఒక పక్షం రాలేని పక్షంలో మరో పక్షం వాదనలు విని ఉత్తర్వులు జారీ చేయకూడదు.
* పోలీసు, జిల్లా వైద్యాధికారులు, బార్‌ అసోసియేషన్‌తో సమావేశాలు నిర్వహించి కోర్టులోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు హైకోర్టుకు నివేదిక పంపాలి. 

మొదటి విడత (ఈ నెల 15 నుంచి 30 వరకు) నిబంధనలు…

* సాధారణ సూచనల అమలుతోపాటు కోర్టుల్లోకి అడ్వకేట్లను, కక్షిదారులను పరిమిత సంఖ్యలోనే అనుమతించాలి.
* కాల్‌వర్క్‌ ఉండదు. హాజరు మినహాయింపుపై జడ్జిలు ఉదారంగా వ్యవహరించాలి. 5 ఏళ్లకు పైబడిన కేసులకు ప్రాధాన్యం ఇవ్వాలి.
* కేసుల జాబితాను ఒకరోజు ముందే సిద్ధం చేయాలి. అవసరమైతే పీపీ, జీపీలను సంప్రదించాలి. ఒక్కో కోర్టులో రోజుకు 20 కేసులను మాత్రమే విచారణకు ఉంచాలి.
* మొదటి రెండు వారాలు 50 శాతం సిబ్బంది రొటేషన్‌ పద్ధతిలో హాజరుకావాలి.
* కోర్టు లోపలికి న్యాయవాదులు, కోర్టు సిబ్బందిని తప్ప ఇతరులను అనుమతించకూడదు.
* పీపీలు, జీపీల కార్యాలయాల్లోకి ప్రవేశం పరిమితంగా ఉండాలి.
* 65 ఏళ్ల వయసు పైబడిన వారు కోర్టులోకి రాకూడదు. ప్రతిఒక్కరూ గుర్తింపు కార్డు తీసుకురావాలి. మాస్కు ధరించకపోతే లోనికి అనుమతించకూడదు.
* కేసు ముగిసిన వెంటనే న్యాయవాదులు వెళ్లిపోవాలి. అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వాదనలు వినాలని విజ్ఞప్తి చేయవచ్చు.
* చిన్న కేసుల్లో కక్షిదారుల వ్యక్తిగత హాజరు అవసరం లేదు. వ్యక్తిగత హాజరు గురించి జడ్జిలు ఒత్తిడి చేయరాదు.
* క్రిమినల్‌ కేసుల్లో బెయిలు, బెయిలు రద్దు, బెయిలు షరతుల సవరణ, క్రిమినల్‌ కేసుల్లో తుది విచారణలు చేపట్టాలి.
* నిందితుడు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంటే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టాలి.
* సివిల్‌ కేసుల్లో ఇంజంక్షన్స్‌, ఎగ్జిక్యూషన్‌, అడ్వొకేట్‌ కమిషన్‌ నియామకం, అటాచ్‌మెంట్స్‌, కుటుంబ వివాదాలపై విచారణ చేపట్టాలి.
* కోర్టులోకి ఒకేసారి అయిదుగురి కంటే ఎక్కువగా అనుమతించకూడదు. జాబితాలో పేర్లున్న న్యాయవాదులను మాత్రమే కోర్టులోకి అనుమతించాలి.
* ఆన్‌లైన్‌తో పాటు భౌతికంగా ఫైలింగ్‌కు అనుమతించాలి. భౌతికంగా ఫైలింగ్‌ చేయడానికి సివిల్‌, క్రిమినల్‌ కేసులకు, జడ్జీల కేడర్‌ల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేయాలి.
* కోర్టులు కంటెయిన్‌మెంట్‌ ప్రాంతంలో ఉంటే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టాలి. 
* కోర్టుల్లో క్యాంటీన్‌లు మూసివేసే ఉంచాలి.

రెండో విడత (జులై 1 నుంచి 15 వరకు) నిబంధనలు…

* సాధారణ సూచనలు, మొదటి విడత నిబంధనలు కచ్చితంగా పాటించాలి.
* కోర్టు హాలులోకి 10 మంది వరకే అనుమతించాలి.
* మొదటి మూడు కేసుల్లోని న్యాయవాదులను మాత్రమే కోర్టులోకి అనుమతించాలి.
* రెండో విడతలో రోజుకు 40 కేసులు మాత్రమే విచారణ జాబితాలో ఉంచాలి.

మూడో విడత (జులై 16 నుంచి ఆగస్టు 7 వరకు) నిబంధనలు…

* సాధారణ సూచనలు, మొదటి, రెండో విడత నిబంధనలు కచ్చితంగా పాటించాలి.
* మూడో విడతలో రోజుకు 60 కేసుల వరకు మాత్రమే విచారణకు అనుమతించవచ్చు.
* ఉదయం 10.15 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే బార్‌ అసోసియేషన్‌ హాలును తెరిచి ఉంచాలి.
* క్యాంటీన్‌కు కూడా ఉదయం 10.15 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తెరచి ఉంచాలి. 

- Advertisement -