కరోనా వ్యాక్సిన్ తయారీలో.. ‘భారత్ బయోటెక్’ ముందడుగు! డిసెంబర్ లోగానే…

2:19 am, Thu, 21 May 20
working-on-a-new-promising-vaccine-against-covid-19-says-bharat-biotech

హైదరాబాద్: ఇది యావత్ ప్రపంచానికి శుభవార్త! కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ఉపయోగపడే వ్యాక్సిన్ కనుగొనేందుకు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఎన్నో కంపెనీలు పోటీ పడి ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ వ్యాక్సిన్‌ తయారీలో తాము మరో ముందడుగు వేసినట్టు హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ బుధవారం తెలియజేసింది.

ఎలుకలపై తాము చేసిన ప్రయోగం సత్ఫలితాన్నిచ్చింనట్లు, డిసెంబర్‌లోపు మనుషులపై ప్రయోగాలకు కూడా సన్నాహాలు చేస్తున్నట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.

భారత్‌ బయోటెక్‌ సంస్థ కరోనా వ్యాక్సిన్‌ తయారీ కోసం అమెరికాకు చెందిన జఫర్సన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఫిలడెల్ఫియాతో ఒప్పందం చేసుకుంది. ఈ రెండు సంస్థలు వ్యాక్సిన్‌ తయారీ కోసం తమ ప్రయోగాలను ముమ్మరం చేశాయి.

ఇప్పటికే జంతువులపై తమ ప్రయోగాలు పూర్తయ్యాయని, వచ్చే నెలలో వాటి ఫలితాలు కూడా వచ్చే అవకాశమున్నట్లు పేర్కొన్నాయి.

రేబిస్‌ వ్యాక్సిన్‌ను నిర్వీర్యం చేసి దానిలోని మూలాలతో కొత్త వ్యాక్సిన్‌ను తయారుచేసి జంతువులపై ప్రయోగించామని, ఆ ప్రక్రియ ఇటీవలే పూర్తయిందని జఫర్సన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఫిలడెల్ఫియాకి చెందిన అంటువ్యాధుల నిపుణుడు ప్రొఫెసర్‌ మిత్తయిస్‌ సచ్‌నెల్‌ తెలిపారు.

రేబిస్‌ వ్యాక్సిన్‌ను డియాక్టివేట్‌ చేసి కరోనా ప్రొటీన్స్‌తో దానికి విరుగుడు కనుగొంటున్నామన్నారు. ఈ విధానంలో బలమైన వ్యాక్సిన్‌ను తయారు చేయవచ్చని, ఈ విధానానికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదముద్ర ఉందని కూడా ఆయన తెలిపారు.

ఈ కరోనా వ్యాక్సిన్‌కు ఇదివరకే కోరోఫ్లూ అని పేరు పెట్టినట్లు భారత్‌ బయోటెక్‌ సంస్థ తెలిపింది. ఎలుకలపై జరిపిన ప్రయోగంలో బలమైన యాంటిబాడీ తయారైనట్లు ఈ సంస్థ పేర్కొంది.

ఇక జంతువులపై జరిపిన ప్రయోగ ఫలితాలు కూడా వచ్చే నెలలో వచ్చే అవకాశముందని, ఈ ఫలితం వచ్చిన వెంటనే తొలిదశ క్లినికల్‌ ట్రయల్‌కు వెళ్తామని ప్రొఫెసర్‌ సచ్‌నెల్‌ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌కు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా జఫర్సన్‌ వర్సిటీతో కలిసి బలమైన వ్యాక్సిన్‌ను కనుగొనడానికి కృషి చేస్తున్నామని భారత్‌ బయోటెక్‌ సంస్థ సీఈవో డాక్టర్‌ కృష్ణమోహన్‌ పేర్కొన్నారు.

‌ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యాన్ని పరిరక్షించడానికి భారత్‌ బయోటెక్ చిత్తశుద్ధితో ఉందని, ఈ వ్యాక్సిన్‌ను కనుగొనడంలో విజయవంతమైతే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఇక్కడినుంచే సరఫరా, మార్కెటింగ్‌ చేసుకొనే అవకాశం దక్కుతుందన్నారు.

ఆ సామర్థ్యం కూడా భారత్ బయోటెక్ సంస్థకు ఉందని, భారత ప్రభుత్వ సహకారంతో ఈ ఏడాది డిసెంబర్‌ లోపలే మనుషులపై క్లినికల్‌ ట్రయల్స్‌ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ఆయన వివరించారు.