ల్యాండింగ్ కుదరక మళ్లీ టేకాఫ్! రన్‌వేను తాకి బంతిలా పైకిలేచిన విమానం..(వీడియో)

4:25 pm, Wed, 13 March 19
british-airways-plane-london-heathrow-airport-storm-erik

బ్రిటన్: ఇటీవల యూకేను ఎరిక్ తుపాను వణికించింది. ఈ తుపాను కారణంగా యూకేలోని ప్రధాన నగరాల్లో గంటకు 70 మైళ్ల వేగంతో గాలులు వీచాయి. ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్, నార్తర్న్ ఐర్లాండ్‌లోని ప్రధాన నగరాల్లో ఎరిక్ తుపాను బీభత్సం సృష్టించింది.

ముఖ్యంగా లాంగ్‌ఫోర్డ్, మాంచెస్టర్, న్యూకాస్టల్, బర్మింగ్‌హామ్‌ నగరాల్లో పెనుగాలులు వీచాయి. ఆ సమయంలో పలు విమానాశ్రయాల్లో విమానాల ల్యాండింగ్‌కు తీవ్ర అంతరాయం కూడా కలిగింది. పెనుగాలుల తాకిడి తీవ్రంగా ఉండడంతో విమానాలను రన్‌ వేపై దించడానికి పైలట్లు తీవ్రంగా శ్రమించారు. హైదరాబాద్ నుంచి యూకే వెళ్లిన ఓ విమానానికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.

బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన బీఏ 276 విమానం హైదరాబాద్‌ నుంచి ఉదయం పూట లండన్‌‌లోని హీత్రోకు బయలుదేరింది. అది హీత్రో విమానాశ్రయంలో మధ్యాహ్నం ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే ఎరిక్ తుపాను కారణంగా హీత్రో విమానాశ్రయంలో వాతావారణం ల్యాండింగ్‌కు అనుకూలంగా లేదు.

అయినప్పటికీ విమానం పైలట్ ల్యాండింగ్ కోసం తీవ్ర ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఈదురు గాలులకు విమానం కూడా అటూ ఇటూ ఊగిపోయింది. విమానం చక్రాలు రన్‌వేను తాకినట్లే తాకి సెకెన్ల వ్యవధిలోనే బంతిలా మళ్లీ విమానం పైకెగిరిపోయింది.

పైలట్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని మళ్లీ టేకాఫ్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన యావత్తూ విమానాశ్రయంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. అలా తిరిగి టేకాఫ్ తీసుకుని గాల్లోనే చక్కర్లు కొట్టిన 18 నిమిషాల తరవాత మళ్లీ విమానాన్ని సురక్షితంగా రన్‌వేపై దించారు. ఆ దృశ్యాన్ని మీరు కూడా కింది వీడియోలో చూడొచ్చు…