అలవోకగా వార్తలు చదివేస్తోన్న తొలి ఏఐ న్యూస్ యాంకర్!

5:07 pm, Wed, 13 March 19
chinese-ai-robot-news-anchor

బీజింగ్: టీవీ చానళ్లలో న్యూస్ యాంకర్లు వార్తలు చదవడం మామూలే. అయితే ఇప్పుడు ఈ న్యూస్ యాంకర్ల స్థానాన్ని క్రమంగా రోబో యాంకర్లు ఆక్రమించుకునే ప్రమాదం కనిపిస్తోంది.

నిజం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్(క‌ృత్రిమ మేధస్సు) తీసుకొస్తోన్న విప్లవం అనాలో, లేకపోతే ప్రమాదం అనాలో తెలియదుగానీ.. క్రమంగా మానవ సామర్థ్యాన్ని పెరుగుతున్న సాంకేతికత మింగేస్తోంది.

చైనా అధికారిక మీడియా జిన్హువా గతేడాది నవంబరులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే రెండు మగ రోబోలను తమ చానల్‌లో వార్తలు చదవడానికి నియమించిన సంగతి తెలిసిందే.

చైనా సెర్చ్ ఇంజిన్ కంపెనీ సోగో, చైనా న్యూస్ ఏజెన్సీ జిన్హువా సంయుక్తంగా రూపకల్పన చేసిన వీటిని చైనాలో గతేడాది నవంబరులో జరిగిన ‘వరల్డ్ ఇంటర్నెట్ కాన్ఫరెన్స్’లో ఆవిష్కరించాయి.

 వర్చువల్ యాంకర్లదే భవిష్యత్తు…

ప్రముఖ న్యూస్ యాంకర్ క్విహో రూపురేఖలతో మెషిన్ లెర్నింగ్ ద్వారా వీటిని అభివృద్ధి చేశారు. చైనీస్ భాషలో వార్తలు చదవడానికి ఒక ఏఐ న్యూస్‌రీడర్‌ను, ఇంగ్లీష్ భాషలో వార్తలు చదవడానికి మరో న్యూస్‌రీడర్‌ను ఉపయోగిస్తున్నారు.

ఈ వర్చువల్ యాంకర్లు అలసట లేకుండా 24 గంటలూ పనిచేస్తాయని.. బ్రేకింగ్ వార్తలను వేగంగా ఈ యాంకర్ల ద్వారా చేరవేయవ్చని జిన్హువా పేర్కొంది. ఈ రోబోలు దాదాపు 3,400 వార్తలను చదివి వినిపించినట్లు జిన్హువా తెలిపింది.

అయితే ఇప్పటివరకు ఈ రోబోలు కూర్చొనే వార్తలు చదివేవి.. అయితే వీటిలో మగ రోబోకు ఇప్పుడు అదనపు ఫీచర్లను జోడించారు. దీంతో ఆ రోబో నిలబడి వార్తలు చదవగలుగుతోంది. ఇంతకుముందు కంటే కూడా మరిన్ని హాహాభావాలను ప్రదర్శిస్తూ టీవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇదిలావుండగా, తాజాగా ఈ వరుసలో మరో ఆడ రోబో వచ్చి చేరింది. ఈ ఆడ రోబో పేరు షిన్‌ షియావోమెంగ్‌. చూడటానికి అచ్చం మనిషిలాగే ఉండే ఈ రోబో అలవోకగా వార్తలు చదివేస్తోంది.

చైనాలో తొలి రోబో న్యూస్‌ యాంకర్‌గా రికార్డులోకెక్కిన ఈమె ప్రస్తుతానికి చైనీస్‌ భాషలో మాత్రమే వార్తలు చదువుతుంది. భవిష్యత్తులో ఈ రోబో న్యూస్ యాంకర్లు అన్ని దేశాలకూ విస్తరించినా ఆశ్చర్యపడనక్కర్లేదు.