షాకింగ్: ఓ సాధారణ స్కూల్ టీచర్ సంపాదన.. ఏడాదికి రూ.కోటి!

3:48 pm, Sat, 6 June 20
up-teacher-took-rs-1-crore-salary-per-month

లక్నో: ఓ సాధారణ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయిని వేతనం ఎంత ఉండొచ్చు? మహా ఉంటే రూ.30-40 వేల వరకు ఉండొచ్చు.

కానీ ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ఓ ప్రభుత్వ ఉపాధ్యాయిని నెలకి ఎంత వేతనం పుచ్చుకుంటుందో తెలుసా? అక్షరాలా కోటి రూపాయలకు పైగానే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

ఈ మధ్య యూపీ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులు, టీచర్ల నిష్పత్తి తదితరాలకి సంబంధించి డిజిటల్ డేటాబేస్ తయారు చేసే క్రమంలో ఈ వైనం వెలుగు చూసింది. 

సదరు ఉపాధ్యాయిని ఆ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏకకాలంలో 25 ఫాఠశాలల్లో పనిచేస్తున్నట్లు తెలియడంతో విద్యాశాఖ అధికారులే అవాక్కయ్యారు.

ఆ ప్రభుత్వ ఉపాధ్యాయిని పేరు అనామిక శుక్లా. యూపీలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయ(కేజీబీవీ)లో ఆమె ఫుల్ టైం టీచర్‌గా పనిచేస్తున్నారు. 

ఈమె అక్కడ ఒక్కచోట మాత్రమే కాకుండా, అమేథీ, అంబేద్కర్ నగర్, రాయ్‌బరేలీ, అలీగఢ్ సహా మొత్తం 25 పాఠశాలల్లో పనిచేస్తున్నట్లుగా రికార్డుల్లో నమోదుకావడాన్ని అధికారులు గుర్తించారు.

ఇలా వివిధ పాఠశాలల నుండి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 13 నెలలపాటు ఆమె వేతనం పొందుతూనే ఉన్నారు. ఆ మొత్తం చూస్తే.. కోటి రూపాయలకు పైమాటే. 

ఈ విషయం తెలియగానే తక్షణమే ఆమె వేతనాన్ని నిలిపివేసిన విద్యాశాఖ అధికారులు.. అసలు ఆమె ఏ బ్యాంకు ఖాతాను ఇందుకు ఉపయోగించారో కనుగొనే పనిలో పడ్డారు.

ఇలా.. ఇన్ని నెలలుగా అక్రమంగా వేతనం పొందుతుండడంపై అనామిక శుక్లాకు అధికారులు ఓ నోటీసు కూడా జారీ చేశారు. 

ఈ వ్యవహారంపై ఇప్పటికే విచారణకు ఆదేశించినట్లు యూపీ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జనరల్ విజయ్ కిరణ్ ఆనంద్ వెల్లడించారు.

ఈ ఉదంతం ఎలా జరిగిందనే దానిపై తామింకా ఒక నిర్ధారణకు రాలేదని, ప్రస్తుతం అనామిక శుక్లా పరారీలో ఉన్నారని, అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మరోవైపు ఈ వ్యవహారంలో విద్యాశాఖ నిర్వాకంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో దీనిపై ఆ రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి డాక్టర్ సతీష్ ద్వివేది కూడా స్పందించారు.

ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటికే దర్యాప్తునకు ఆదేశించామని, ఆరోపణలు నిజమైన పక్షంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

కేజీవీబీలో కాంట్రాక్టు పద్ధతిపై కూడా నియామకాలు ఉంటాయని, ఏదిఏమైనా ఈ ఉదంతంలో ప్రమేయం ఉన్న విద్యాశాఖ అధికారులపై కూడా చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.