ఇంట్లోనే మద్యం తయారు చేసుకోవడం ఎలా?: గూగుల్‌లో.. తెగ వెతికేసిన మందుబాబులు!

4:10 pm, Wed, 15 April 20
how-to-make-alcohol-at-home-trending-in-google-search

ఒకవైపు లాక్‌డౌన్.. మరోవైపు నాలుక పీకుడు, బయటికెళ్దామంటే కుదర్దు, ఎవరైనా డోర్ డెలివరీ చేస్తే ఎంత బాగుండు.. ఏం చేయాలో అర్థం కాదు, దిక్కుతోచని స్థితి. జేబులో డబ్బులున్నాయి, బ్లాకులో అయినా కొనడానికి రెడీ.. కానీ అమ్మేవాళ్లు ఏరీ?

ఇదీ ప్రస్తుతం మద్యం ప్రియుల పరిస్థితి. వీళ్ల కష్టాలు మామూలుగా లేవు. మద్యం వాసన తగిలి ఇప్పటికే వారాలు గడిచాయి. ఈ లాక్‌డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారో? మద్యం దుకాణాలు ఎప్పుడు తెరుస్తారో అర్థంకాని పరిస్థితుల్లో మద్యం కోసం తల్లడిల్లుతున్నారు.. కొందరైతే పరితపించి పోతున్నారు. 

బ్లాక్‌లో చుక్కలను తాకుతోన్న మద్యం ధర…

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బ్లాక్‌లో మద్యం దొరుకుతున్నప్పటికీ… దాని ధర మాత్రం చుక్కలను తాకుతోంది. హైదరాబా‌ద్‌లో క్వార్టర్ రూ.140 ఉండే మద్యం సీసాను ఇదే అదనుగా ఇప్పుడు బ్లాక్ లో రూ.750కి విక్రయిస్తున్నారు. బీరు కూడా బాటిల్ ధర రూ.400-450 మధ్యలో పలుకుతోంది.

ప్రస్తుతం మద్యం ప్రియుల పరిస్థితి దేశ వ్యాప్తంగా ఇలాగే ఉంది. ఎంత డబ్బు పోసి అయినా కొనడానికి కొందరు రెడీ.. కానీ సరుకే దొరకడం లేదు. దీంతో సొంతంగా ఇంట్లోనే మద్యం తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇదే ఆలోచన చాలామంది మందుబాబుల మదిలో కదలాడింది.

అంతే.. ఆలోచన వచ్చిందే తడవుగా గూగులమ్మను ఆశ్రయించారు. ‘ఇంటి వద్ద ఆల్కహాల్ తయారు చేయడం ఎలా?’ అని తెగ వెతుకేస్తున్నారు. ఇంట్లో మద్యం తయారు చేయడం ఎలాగో మద్యం ప్రియులకు తెలియకపోయినా.. మార్చి 22 నుంచి 28 వరకు ఆన్‌లైన్ సెర్చింగ్‌లో ఇదే టాప్‌గా నిలిచింది.