అప్పుడు నేను పిల్లాడిని.. శిక్ష తగ్గించండి: సుప్రీంకు నిర్భయ దోషి

- Advertisement -

న్యూఢిల్లీ: నేరం జరిగినప్పుడు తాను పిల్లాడినని, కాబట్టి తనకు శిక్ష తగ్గించాలంటూ నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ విషయంలో గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీంకోర్టులో సవాలు చేశాడు.

దోషులను ఉరి తీసేందుకు తీహార్ జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్న వేళ.. పవన్ గుప్తా కోర్టును ఆశ్రయించడం గమనార్హం. తాను అప్పట్లో మైనర్‌ను కనుక ఆ చట్ట నిబంధనల మేరకు తనకు తక్కువ శిక్ష విధించాలని కోరాడు.

ఈ కేసులో మరో దోషి ముకుశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తిరస్కరించారు. దీంతో ఈ దోషులను ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి.

ముకేశ్ సింగ్ పిటిషన్ తిరస్కరించినప్పటి నుంచి శిక్ష అమలుకు 14 రోజుల వ్యవధి ఉండాలన్న నిబంధనల మేరకు ఫిబ్రవరి 1కి ఉరిని మార్చారు.

మళ్లీ వాయిదా వేయొద్దు: ఆశాదేవి

దోషులకు ఉరిశిక్షను మళ్లీ వాయిదా వేయొద్దని నిర్భయ తల్లి ఆశాదేవి కోరారు. ఈ నెల 22నే వారిని ఉరి తీయాల్సి ఉండగా ఫిబ్రవరి 1కి వాయిదా వేశారని ఆమె పేర్కొన్నారు.

న్యాయం కోసం ఇన్నేళ్ళుగా తాను కోర్టుల చుట్టూ తిరుగుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తీహార్ జైలు అధికారులతో పాటు ఢిల్లీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి తానెందుకు బాధ అనుభవించాలని ప్రశ్నించారు.

దోషులను క్షమించాలని, పెద్ద మనసు చేసుకుని ఉరితీతను ఆపాలని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన వ్యాఖ్యలను ఆశాదేవి తప్పు పట్టారు. ఆమె అలా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు.

ఆమెను తాను చాలాసార్లు కలిశానని, ఒక్కసారికూడా ఆమె తన బాగోగుల గురించి అడగలేదని విమర్శించారు. ఇప్పుడేమో దోషుల తరపున ఆమె వకాల్తా పుచ్చుకోవడం ఏమిటని నిలదీశారు. ఇటువంటి వారి వల్లే అత్యాచార దోషులకు శిక్ష పడడం లేదని ఆరోపించారు.

- Advertisement -