షాకింగ్: సోనాక్షికి ఇది కూడా తెలియదా? బిగ్ బీ కేబీసీ షోలో.. పరువంతా పాయె!

10:46 pm, Sat, 21 September 19
sonakshi-sinha-in-kbc-show

ముంబై: రామాయణంలో హనుమంతుడు సంజీవిని మూలికను ఎవరి కోసం తీసుకొచ్చాడు? ఎవరి కోసం ఏంటి? లక్ష్మణుడి కోసం.. అంటారా? నిజమే ఈ ప్రశ్నకు చిన్న పిల్లలు కూడా సమాధానం చెబుతారు.

కానీ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాకు మాత్రం ఈ ప్రశ్నకు సమాధానం తెలియదు. దీనికోసం ఆమె చివరికి ‘హెల్ప్‌ లైన్’ సైతం ఉపయోగించుకుంది. దీంతో సోనాక్షి సిన్హాపై నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. ప్రస్తుతం సోనాక్షి ఎపిసోడ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది.

అసలేం జరిగిందంటే…

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో గురించి తెలుసుగా. ఈ షో పదకొండో సీజన్‌లో పాల్గొనేందుకు ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా విచ్చేశారు. రాజస్థాన్ నుంచి వచ్చిన ఓ మహిళా పోటీదారుకు మద్దతుగా ఆమె వచ్చారు.

ఈ సందర్భంగా అమితాబ్ పైన చెప్పిన ప్రశ్నను కంప్యూటర్ స్క్రీన్‌పైన వేశారు. అంతేకాదు, దీనికి సమాధానంగా ఆయన నాలుగు ఆప్షన్లు కూడా ఇచ్చారు.

అయితే ఈ ప్రశ్నకు సమాధానం మన సోనాక్షి సిన్హాకు తెలియదు. దీంతో సమాధానం చెప్పే ప్రక్రియలో ఆమె కొంత తికమక పడి చివరికి హెల్ప్ లైన్ ఆప్షన్‌ను సైతం ఉపయోగించుకున్నారు. దీంతో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సైతం ఆశ్చర్య పోయారు. సోనాక్షి.. ఈ ప్రశ్నకు సమాధానం నీకు తెలియదా? అంటూ ఆయన ఆమెను ప్రశ్నించారు కూడా.

ఇంకేముంది, సోనాక్షి వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు దీనిపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ట్విట్టర్ ఇండియాలో SonakshiSinhaInKBC అనే హ్యాష్‌ట్యాగ్ (#) ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది.

‘విచిత్రం ఏమిటంటే.. ఆమె ఇంటి పేరు రామాయణం. తండ్రి పేరు శత్రుఘ్న. సోదరుల పేర్లు లవ, కుశ. ఇక రామ్, లక్ష్మణ్, భరత్ అనే అంకుల్స్ కూడా ఉన్నారు. కానీ సంజీవని గురించి మాత్రం సోనాక్షికి తెలియదు..’ అంటూ ఓ నెటిజన్ ట్విట్టర్‌లో కామెంట్ చేశారు.

ఇంకా.. ‘ఇంత సులభమైన ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయావా?’, ‘సోనాక్షి.. మళ్లీ స్కూలుకెళ్లి చదువుకో’, ‘నువ్వు నటి కావడం ఆశ్చర్యంగా ఉంది’, ‘మీకంటే మీరు మద్ధతుగా నిలిచిన పోటీదారునికే ఎక్కువ నాలెడ్జి ఉన్నట్లుంది’, ‘ఈ మాత్రం నాలెడ్జి కూడా లేని నువ్వు మిషన్ మంగళ్ సినిమాలో శాస్త్రవేత్తగా ఎలా నటించావు?’.. ఇలా రకరకాల కామెంట్లు వెల్లువెత్తాయి.

కొంతమంది సోనాక్షి వ్యవహారంపై రకరకాల మీమ్స్ కూడా రూపొందించారు. అయితే సోనాక్షి సిన్హా మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.

అంతేకాదు, ‘‘నాకు పైథాగరస్ సిద్ధాంతం, మర్చంట్ ఆఫ్ వెనిస్, ఆవర్తన పట్టిక, మొఘల్ వంశ చరిత్ర ఇలాంటి విషయాలు కూడా గుర్తు లేవు.. మీరు చాలా ఖాళీగా ఉన్నట్లున్నారు.. వీటిపైన కూడా మీమ్స్ చేయండి ప్లీజ్.. నాకు మీమ్స్ అంటే ఇష్టం..’’ అంటూ నెటిజన్ల విమర్శలపై స్పందించారామె.