అందరూ ఉండీ అలా: తెలంగాణలో తొలి కరోనా పేషెంట్ మృతదేహానికి అంత్యక్రియలు ఇలా…

2:52 pm, Tue, 31 March 20
telangana-first-coronavirus-patient-s-last-rituals-held-without-his-relatives-and-friends

హైదరాబాద్: తెలంగాణలో తొలిసారిగా ఓ కరోనా పేషెంట్ మరణించారు. బాధితుడు హైదరాబాద్‌ పాతబస్తీలో నివసించే 74 సంవత్సరాల వృద్ధుడు. మార్చి 14న ఢిల్లీ వెళ్లిన ఈ వృద్ధుడు ఆ తరువాత మూడు రోజులకే హైదరాబాద్ తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. 

ఆ తరువాత జలుబు, జ్వరం, శ్వాసకోశ ఇబ్బందితో గ్లోబల్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. ఈ విషయం తెలియగానే ప్రభుత్వ వైద్యశాఖ అధికారులు ఆ వృద్ధుడి మృతదేహాన్ని ప్రైవేటు ఆసుపత్రి నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.

చదవండి: మద్యం దొరక్కపోతే వాళ్లేమైపోవాలి.. షాపులు తెరవండి: సీనియర్ నటుడి విన్నపం

అక్కడ పోస్టుమార్టం నిర్వహించగా, ఆ వృద్ధుడు కరోనా వైరస్ కారణంగానే మరణించినట్లు తేలింది. దీంతో ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తరువాత ఆ వృద్ధుడు ఎవరెవరిని కలిశాడన్న విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఆ వృద్ధుడి మృతదేహానికి సోమవారం ఉదయం ఖైరతాబాద్‌లోని స్మశానవాటికలో అంత్యక్రియలను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులుగానీ, బంధుమిత్రులుగానీ ఎవ్వరూ రాలేదు. రానివ్వలేదు కూడా. కారణం.. ఆ వృద్ధుడి కుటుంబ సభ్యులు, బంధువుల్లో చాలామంది ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంటున్నారు. వారికి కూడా కరోనా వైరస్ సోకి ఉండొచ్చని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.

వైద్యశాఖ సిబ్బంది ఆధ్వర్యంలోనే అంత్యక్రియలు…

దీంతో ఆ వృద్ధుడి మృతదేహానికి అంత్యక్రియల కార్యక్రమాన్ని వైద్యశాఖ సిబ్బందే నిర్వహించారు. ఈ మేరకు ఆయన కుటుంబీకులకు సమాచారం మాత్రమే ఇచ్చారు. అతడి మృతదేహాన్ని అంబులెన్స్‌లో శ్మశానానికి తరలించారు. అప్పటికే అక్కడ తీసి ఉంచిన గొయ్యిలో పాతిపెట్టారు. ఆ సమయంలో ఆయన సోదరుడు ఒక్కడే హాజరైనట్లు సమాచారం.  

ఆ వృద్ధుడి మృతదేహాన్ని కిందికి దించే ముందు వైద్యశాఖ సిబ్బంది ఆ ప్రాంతాన్ని పూర్తిగా శానిటైజ్ చేశారు. మృతదేహాన్ని గొయ్యిలో ఉంచిన తరువాత కూడా శానిటైజ్ చేశారు. ఆపైన గోతిని మట్టితో పూడ్చివేశారు. అతడి శరీరంలో ఉన్న వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం ఉన్నందున.. పూడ్చిపెట్టిన స్థలాన్ని శానిటైజ్ చేశామని వైద్య సిబ్బంది తెలిపారు.

చదవండి: గ్రేట్: రూ.12కే కరోనా వైరస్ టెస్టింగ్ కిట్.. కనుగొన్నది మన మహిళా శాస్త్రవేత్త!

కరోనా వైరస్ కారణంగా మరణించే వారి మృతదేహాలకు అంత్యక్రియలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని నిబంధనలను జారీ చేసింది. వాటికి అనుగుణంగానే తాము ఆ వృద్ధుడి అంత్యక్రియలను చేపట్టినట్లు వారు పేర్కొన్నారు.

సాధారణంగా అంత్యక్రియల సమయంలో మృతుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శ్మశానం వరకు రావడం, కడసారి చూసుకోవడం, ఆపైన జరగాల్సిన తంతును జరిపించడం వంటివి జరుగుతాయి. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఆ వృద్ధుడి అంత్యక్రియల్లో ఇలాంటివేవీ కనిపించకుండా పోయాయి.

ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి ఆ వృద్ధుడు మరణించడం, అదే సమయంలో అతడి కుటుంబ సభ్యులు కూడా క్వారంటైన్‌లో ఉండటం వంటి పరిస్థితుల కారణంగా.. సంప్రదాయానికి భిన్నంగా అతడి అంత్యక్రియలను జరిగాయి.

అంత్యక్రియలు జరిపే సమయంలో వైద్యశాఖ సిబ్బంది ఆ చుట్టుపక్కల కూడా ఎవ్వరూ ఉండకుండా జాగ్రత్తలు తీసున్నారు. అందరూ ఉండీ అనాధలా పోవడమంటే ఇదే మరి!

చదవండి: ఆదర్శం ఈ యువకులు.. 14 రోజులు చెట్లపైనే క్వారంటైన్!