ఆశ్చర్యం: ఒక్క పెయింటింగ్ ఖరీదు రూ.778 కోట్లు..! ఇంతకీ ఏముంది అందులో..?

1:30 pm, Thu, 16 May 19
painting

ఫ్రాన్స్‌: సాధారణంగా ఫేమస్ పెయింటర్లు వేసే పెయింటింగ్స్ కొన్ని మ్యూజియంలలో, ఆర్ట్ ఎగ్జిబిషన్‌లలో సాధారణంగా కనిపిస్తుంటాయి. కానీ , ఫ్రాన్స్‌కి చెందిన పెయింటర్ క్లాడ్ మానెట్ వేసిన పెయింటింగ్స్ ని మాత్రం చాలావరకూ మ్యూజియంలకు వెళ్లక ముందే ఎవరో ఒకరు కొనేస్తూ ఉంటారు.

ఇప్పటివరకూ అలా 7 కళాఖండాలు అమ్ముడైపోగా, తాజాగా ఇప్పుడు మరో అద్భుత పెయింటింగ్ అత్యధిక ధర పలికింది. మ్యూల్స్ పేరుతో క్లాడ్ మానెట్ 1890లో వేసిన పెయింటింగ్‌ని సోథెబీ సంస్థ వేలం వేసింది. వేలంలో అది ఏకంగా రూ.778 కోట్లు పలికింది. మానెట్ వేసిన పెయింటింగ్స్‌లో అత్యధిక ధర పలికింది ఇదే కావడం విశేషం. ఇంప్రెషనిస్ట్ ఆర్ట్ వర్క్‌లో $100 మిలియన్ల ధర దాటిన మొదటి ఆర్ట్ కూడా ఇదే కావడం మరోవిశేషం.

ఇకపోతే అంతర్జాతీయ వేలంలో అత్యధిక ధర పలికిన తొమ్మిదో పెయింటింగ్ ఇది. ఇంతకు ముందు 1986లో ఇదే పెయింటింగ్‌ను రూ.17 కోట్లకు కొన్నారు గత ఓనర్. ఈ సారి వేలంలో ఈ కళాఖండాన్ని దక్కించుకునేందుకు ఆరుగురు పోటీ పడ్డారు. అయితే , దీన్ని ఎవరు దక్కించుకున్నారో సోథెబీ వెల్లడించలేదు.

క్లాడ్ మానెట్ వేసిన మరికొన్ని చిత్రాలు, న్యూయార్క్ ఆర్ట్ మ్యూజియం, చికాగోలోని ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్, ప్యారిస్‌లోని మ్యూస్డ్ ఓర్సేలో ఉన్నాయి. ఇంతకీ దీని ప్రత్యేకత చెప్పలేదు కదూ. 1890, 1891లో దాదాపు ఏడాదిపాటూ ఇదే పెయింటింగ్‌ను వేశాడు క్లా్డ్ మానెట్.

ఇందుకోసం ఆయన ఒకే ప్రదేశానికి వేర్వేరు కాలాల్లో నాలుగైదుసార్లు వెళ్లాడు. అందువల్ల వెళ్లిన ప్రతిసారీ ఆయన వేయాలనుకున్న ప్రదేశం రకరకాల రంగులతో కొత్తగా కనిపించింది. అందువల్ల ఆయన వేసిన పెయింటింగ్ కూడా సరికొత్తగా అనిపిస్తూ ఆకట్టుకుంటోంది. ఏమైనా కూడా ఒక పెయింటింగ్ ఖరీదు రూ.778 కోట్లు అంటే మాములు విషయం కాదు కదా.