అమెరికాలో దారుణం: తెలుగు కుటుంబంలో నలుగురి మృతి.. ఇంకా వీడని మిస్టరీ!

3:08 pm, Fri, 21 June 19
telugu-people-died-in-us

వాషింగ్టన్: అమెరికాలో తెలుగు కుటుంబానికి చెందిన నలుగురి అనుమానాస్పద మృతి మిస్టరీ ఇంకా వీడలేదు. గత శనివారం ఉదయం ఐయోవా రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. శవ పరీక్ష నివేదిక వచ్చే వరకు వీరి మరణానికి దారితీసిన పూర్తి వివరాలు తెలియవని అధికారులు పేర్కొన్నారు.

అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో వెస్ట్‌డెస్‌ మోయిన్స్‌లో యాష్‌వర్త్‌ రోడ్డు-అస్పెన్‌ డ్రైవ్‌ల మధ్య ఉన్న 65వ వీధిలో నివాసం ఉంటున్న సుంకర చంద్రశేఖరరెడ్డి(44), ఆయన భార్య లావణ్య(41), కుమారులు ప్రభాస్‌(15), సుహాన్‌(10) బుల్లెట్ గాయాలతో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు.

చంద్రశేఖరరెడ్డి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, లావణ్య కూడా అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. 2003లో వీరికి చీరాలలో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

లావణ్య ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట పంచాయితీకి చెందిన సీతారామిరెడ్డి పెద్ద కుమార్తె. సుంకర చంద్రశేఖరరెడ్డి గుంటూరు జిల్లా వింజనంపాడుకు చెందినవారు. చీరాలలో వివాహం చేశారు. గత మే 29న చంద్రశేఖరరెడ్డి ఓ ఇంటిని కొనుగోలు చేయగా గృహప్రవేశానికి ఆహ్వానించడంతో ఆయన అత్తమామలైన సీతారామిరెడ్డి, హైమావతి అమెరికా వెళ్లారు.

తుపాకీ పేలుడు శబ్దం వినిపించడంతో…

ఘటన జరిగిన శనివారం రోజు ఇంట్లో తుపాకీ పేలుడు శబ్దం వినిపించడంతో కింద పోర్షన్‌లో ఉంటోన్న లావణ్య చెల్లెలు పిల్లలు ఇద్దరు పైకి వెళ్లి.. చంద్రశేఖరరెడ్డి కుటుంబం రక్తపు మడుగులో పడి ఉండడంతో చూసి బయటికొచ్చి కేకలు వేస్తూ చుట్టుపక్కల వారిని పిలిచారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

ఈ విషయమై నగర పోలీస్‌ సార్జంట్‌ డాన్‌ వేడ్‌ మాట్లాడుతూ..‘యాష్‌వర్త్‌ రోడ్డు–అస్పెన్‌ డ్రైవ్‌ల మధ్య ఉన్న 65 స్ట్రీట్‌లోని ఓ ఇంట్లో సమస్య ఉందని శనివారం ఉదయం 10 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) 911కు ఫోన్‌కాల్‌ వచ్చింది. దీంతో మా యూనిట్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఇంట్లో బుల్లెట్‌ గాయాలతో రక్తపు మడుగులో ఉన్న నలుగురి మృతదేహాలను గుర్తించాం. ఈ ఘటన ఎలా జరిగిందన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు అని వివరించారు.