ఘోరం: అమెరికాలో మళ్లీ గర్జించిన గన్.. తల్లిదండ్రులు సహా ఐదుగురిని పొట్టనబెట్టుకున్న యువకుడు

2:30 pm, Sun, 27 January 19

louisiana-shooting-dakota-theriot

వాషింగ్టన్: ఇంట్లోకి రావద్దంటూ తల్లిదండ్రులు హెచ్చరించినందుకు ఓ కుమారుడు రెచ్చిపోయాడు. విచక్షణ కోల్పోయి.. కన్నవారనే కనికరం కూడా లేకుండా తల్లిదండ్రులను తుపాకీతో కాల్చిచంపాడు. అంతేకాదు, తన కుటుంబానికి పరిచయం ఉన్న మరో ముగ్గురిని కూడా దారుణంగా హతమార్చాడు.

ఆపైన వారి ట్రక్కును తీసుకుని అక్కడ్నించి పరారయ్యాడు. అమెరికాలోని లూసియానాలో శనివారం ఉదయం ఈ దారుణం చోటుచేసుకుంది. లూసియానా రాష్ట్రంలోని అసెంప్షన్ ప్రాంతానికి చెందిన డకోటా థెరియోట్(21) జులాయిగా తిరుగుతూ ఉండేవాడు. కొడుకు ప్రవర్తనతో విసిగి వేసారిన తల్లదండ్రులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనీ, ఎన్నడూ ఇంటికి తిరిగిరావొద్దని తల్లిదండ్రులు స్పష్టం చేశారు.

ఇంటికి తిరిగిరావొద్దని అన్నందుకే…

దీంతో విచక్షణ కోల్పోయిన థెరియోట్ ఎలాగోలా ఓ తుపాకీని సంపాదించాడు. అనంతరం లివింగ్ స్టన్ ప్రాంతంలో ఉంటున్న బిల్లీ ఎర్నెస్ట్(43), సమ్మర్ ఎర్నెస్ట్ (20), టన్నర్ ఎర్నెస్ట్(17)ను కాల్చిచంపాడు. వీరంతా నిందితుడి కుటుంబానికి పరిచయస్తులేనని అధికారులు తెలిపారు.

ముగ్గురిని హతమార్చిన అనంతరం వారి ట్రక్కును తీసుకుని ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులు కీత్(51), ఎలిజబెత్‌లను వెంటపడి మరీ తుపాకీతో కాల్చాడు. అనంతరం అదే ట్రక్కులో అక్కడ్నించి పరారయ్యాడు. థెరియోట్ కాల్పుల్లో అతడి తల్లిదండ్రులు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న థెరియోట్ కోసం గాలింపు జరుపుతున్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

విషాదం: అమెరికాలో తెలుగు వ్యక్తి దారుణ హత్య, 16 ఏళ్ల బాలుడి చేతిలో కాల్పులకు గురై…

అమెరికాలో మరో ఉన్మాది ఘాతుకం: బలైపోయిన పోలీసు అధికారి