అమెరికాలో దుండగుల కాల్పులు.. భారతీయ యువకుడి మృతి

on-way-home-punjab-youth-baljeet-singh-killed-in-usa
- Advertisement -

చికాగో: అమెరికాలో ఓ భారత యువకుడు అనూహ్యంగా మృతి చెందాడు. తన విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో దుండగులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడ్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించాడు. ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. 

పంజాబ్‌‌లోని చాట్ గ్రామానికి చెందిన విద్యార్థి బల్జీత్‌ సింగ్‌ అలియాస్‌ ప్రిన్స్‌ (28) అనే విద్యార్థి చికాగోలోని ఓ డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో పనిచేసుకుంటూ చదువుకుంటున్నాడు.  బుధవారం రాత్రి డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌లో తన విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా బల్జీత్‌ను కొంతమంది దుండగులు అడ్డగించారు.

ఏమీ దొరకలేదన్న కోపంతో…

అయితే అతడి వద్ద వారికెలాంటి సొమ్ము, విలువైన వస్తువులు లభించలేదు. దీంతో వారు అతడిపై కాల్పులు జరిపి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన బల్జీత్ సింగ్ జరిగిన ఉదంతాన్ని ఫోన్ ద్వారా డిపార్ట్‌మెంట్ స్టోర్ యజమాని అవతార్ సింగ్‌కు తెలియపరచగా.. ఆయన ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని సమీప ఆస్పత్రికి తరలించారు. 

మర్నాడు ఉదయం అవతార్ సింగ్ ద్వారా జరిగిన ఘాతుకాన్ని బల్జీత్ సింగ్ కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. అక్కడి  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తన మనుమడు మరణించినట్టు తమ గ్రామానికే చెందిన, అమెరికాలో డిపార్ట్‌మెంట్ స్టోర్ నడుపుతున్న అవతార్ సింగ్ ద్వారా తమకు తెలిసిందని బల్జీత్‌ తాత ఫమ్మాన్ సింగ్ పేర్కొన్నారు. 

‘‘రెండ్రోజుల క్రితమే మాట్లాడాం.. ఇంతలోనే…’’

బల్జీత్ సింగ్ తండ్రి ఇంద్రజిత్ సింగ్ రైతు. తన కుమారుడు మెట్రిక్ వరకు చదువుకున్నాడని, అమెరికా వెళ్లడం అతడి కల అని, ఏడాదిన్నర క్రితం అమెరికా వెళ్లాడని, ఇప్పుడు ఉన్నట్లుండి అతడి మరణంతో తమ ఆశలు నిరాశలయ్యాయని విలపించారు.

బల్జీత్ సింగ్‌కు ఇద్దరు అక్కచెల్లెళ్లు కూడా ఉన్నారు. అతడ్ని అమెరికా పంపేందుకు దాదాపు రూ.45 లక్షలు ఖర్చైనట్లు సమాచారం.

‘‘మా అబ్బాయి మరణించాడంటే మేం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. ఎందుకంటే.. రెండ్రోజుల క్రితమే మేం అతడితో మాట్లాడాం. ఇంతలోనే ఘోరం జరుగుతుందని అనుకోలేదు.. ఇప్పుడిక కడసారిగా చూసేందుకు అతడి మృతదేహం ఇక్కడికి చేరడానికి ఎన్ని రోజులు పడుతుందో..’’ అంటూ ఇంద్రజిత్ సింగ్ గద్గద స్వరంతో చెప్పారు. 

- Advertisement -