మౌనిక ఇష్యూ: రూ.20 లక్షల నగదు, రూ.15 లక్షల బీమా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం…

kodandaram-sudhakar-with-deceased-mounika-family-members
- Advertisement -

హైదరాబాద్: ఎట్టకేలకు మెట్రో అధికారులు, ఎల్ అండ్ టి ప్రతినిధులు దిగివచ్చారు. మౌనిక మృతికి పరిహారంగా రూ.20 లక్షల నగదు, రూ.15 లక్షల బీమాతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించేందుకు అంగీకరించారు. దీనికి మౌనిక కుటుంబ సభ్యులు అంగీకరించడంతో ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. 

ఆదివారం మధ్యాహ్నం వర్షం పడుతున్న సమయంలో అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ పిల్లర్‌ వద్ద తలదాచుకుని, అదే సమయంలో పిల్లర్ ప్లాస్టరింగ్  పెచ్చులూడి పడిన ఘటనలో కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన మౌనిక దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.

ఈ ఘటనపై మౌనిక భర్త హరికాంత్ రెడ్డి ఫిర్యాదుతో ఎస్‌ఆర్ నగర్ పోలీసులు మెట్రో నిర్మాణం చేపట్టిన ఎల్ అండ్ టీ కంపెనీపై 304(ఎ) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

మౌనిక మృతికి మెట్రో అధికారుల నిర్లక్ష్యమే కారణమని, నష్టపరిహారం కింద రూ.50 లక్షలు చెల్లించాలని ఆమె కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. అయితే దీనికి తొలుత ఎల్ అండ్ టీ అధికారులు అంగీకరించపోవడంతో సీపీఐ నేత సుధాకర్, టీజేఎస్ నేత కోదండరాం వారితో దాదాపు గంట సేపు చర్చలు జరిపారు. 

మంత్రి కేటీఆర్ ఆరా, ఎన్వీఎస్ రెడ్డికి ఆదేశాలు…

మరోవైపు ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ కూడా ఆరా తీశారు. ఘటనపై తమ ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, మున్ముందు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా సంబంధిత ఇంజనీరింగ్ నిపుణలతో చర్చించి సరైన పరిష్కారం కనుగొనాలిని ఆయన మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఆదేశించారు. 

అన్ని స్టేషన్ల నిర్మాణాలు, సౌకర్యాలను సూక్ష్మంగా తనిఖీ చేయాలని.. నాణ్యత, భద్రత ప్రమాణాల విషయంలో ఇప్పటి వరకు సాధించిన ఖ్యాతిని మెట్రో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని, అన్ని సమయాల్లో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారని ఆయన పేర్కొన్నారు. 

పరిహారం కోసం పట్టు…

అయితే ఒక దశలో ఎల్ అండ్ టి అధికారులు ఎక్స్‌గ్రేషియా ఇవ్వడానికి ఒప్పుకోలేదు. మెట్రో ఘటనలో ప్రమాదవశాత్తు మరణిస్తే వచ్చే ఇన్స్యూరెన్స్ డబ్బు మాత్రమే ఇస్తామని చెప్పినప్పటికీ, అసలు ఈ ప్రమాదానికి ఇన్స్యూరెన్స్ వర్తిస్తుందా? లేదా? అన్న విషయంపై కూడా వారు ఏమాత్రం స్పష్టత ఇవ్వకపోవడంతో మౌనిక కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అలాగే బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే విషయంలోనూ ఎల్ అండ్ టి అధికారులు ఎటూ తేల్చకపోవడంతో వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

మరోవైపు అనూహ్యంగా మౌనిక మరణించడంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.  మౌనికను కడసారి చూసేందుకు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు విచ్చేసిన బంధువులు గాంధీ ఆసుపత్రి మార్చురీ వద్దకు చేరుకున్నారు. తమ డిమాండ్లు ఒప్పుకునే వరకు మౌనిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించరాదని వారంతా పట్టుబట్టారు.

ఎట్టకేలకు తలవంచిన ఎల్ అండ్ టి అధికారులు… 

దీంతో గంట సేపు చర్చలు సాగాయి. రూ.10 లక్షల వరకు పరిహారం చెల్లిస్తామని తొలుత అన్న ఎల్ అండ్ టి అధికారులు చివరికి రూ.20 లక్షలు చెల్లించేందుకు అంగీకరించారు. అలాగే రూ.15 లక్షల ఇన్స్యూరెన్స్ వర్తింపు.. దాంతోపాటు మౌనిక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించేందుకు కూడా ఒప్పుకున్నారు. 

పరిహారం విషయంలో భరోసా లభించడంతో మౌనిక మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించారు. దీంతో గాంధీ ఆసుపత్రి మార్చురీలో ఉన్న మౌనిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఈ క్రమంలో మౌనిక అంత్యక్రియల కోసం ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

చదవండి: షాకింగ్: మెట్రో పిల్లర్ ప్లాస్టరింగ్ పెచ్చులూడి పడి.. మహిళ దుర్మరణం
- Advertisement -