హెచ్1బీ వీసా స్కాం: అమెరికాలో ఇద్దరు తెలుగువారు సహా నలుగురు భారతీయుల అరెస్ట్!

2:16 pm, Wed, 3 July 19
h1b-visa-fraud-in-us

న్యూజెర్సీ: విదేశీ నిపుణులకు అమెరికా జారీచేసే హెచ్1బీ వీసాలను త్వరగా పొందడానికి తప్పుడు పత్రాలు సృష్టించారనే అభియోగంపై అమెరికాలో ఇద్దరు తెలుగు వ్యక్తుల సహా నలుగురు భారతీయులు అరెస్ట్ అయ్యారు. అరెస్టయిన వారిలో వెంకటరమణ మన్నెం(47), సతీశ్ వేమూరి(52)తోపాటు విజయ్ మానే(39), ఫెర్నాండో సిల్వ(53)లు ఉన్నారు.

చదవండి: అమెరికాలో దారుణం: తెలుగు కుటుంబంలో నలుగురి మృతి.. ఇంకా వీడని మిస్టరీ!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వెంకటరమణ, సతీశ్ వేమూరి, విజయ్ మానేలు న్యూజెర్సీ కేంద్రంగా ప్రొక్యూర్ ప్రొఫెషనల్స్ ఇన్‌కార్పొరేషన్ , క్రిప్టో ఐటీ సొల్యూషన్స్ ఇన్‌కార్పొరేషన్ పేర్లతో కంపెనీలు నిర్వహిస్తున్నారు.

ఈ రెండు కంపెనీలతో పాటు మరో కంపెనీని(క్లయింట్ ఏ) కూడా వీరు నిర్వహించేవారు. అమెరికాకు రావాలనుకునే భారతీయ నిపుణులకు వీరు హెచ్1బీ వీసాలు ఇప్పించేవారు.

తప్పుడు పత్రాలు సమర్పించినందుకు…

అయితే హెచ్1బీ వీసాల జారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సదరు భారతీయులు ఇప్పటికే తమ కంపెనీ(క్లయింట్ ఏ)లో పనిచేస్తున్నట్లు ఇమ్మిగ్రేషన్ శాఖకు వీరు తప్పుడు పత్రాలు సమర్పించారని వెల్లడైంది.వాస్తవానికి హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేసిన ఆ భారతీయులు ఏ కంపెనీలోనూ పనిచేయడం లేదు.

దీంతో వెంకటరమణ మన్నెం, సతీశ్ వేమూరి, విజయ్ మానే, ఫెర్నాండో సిల్వపై అక్కడి పోలీసులు వీసా మోసం అభియోగాల కింద కేసు నమోదు చేసి, విచారించారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

పరిశీలించిన న్యాయస్థానం 2,50,000 డాలర్ల బాండ్ పూచీకత్తుపై వీరికి బెయిల్ మంజూరు చేసింది. ఒకవేళ ఈ నేరం రుజువు అయితే దోషులకు ఐదేళ్ల జైలుశిక్ష, 2.50 లక్షల జరిమానా విధిస్తారని పోలీసులు వివరించారు.

చదవండి: ఒక సామాన్యుడి ప్రస్థానం.. శ్రీధర్ బెవర రాసిన.. ‘మూమెంట్ ఆఫ్ సిగ్నల్’