అమెరికాలో కాల్పుల ఉన్మాదం.. ఓహియోలో 9 మంది, టెక్సాస్‌లో 20 మంది మృతి..

10:18 pm, Mon, 5 August 19
dayton-mass-shooting

వాషింగ్టన్: అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఇక్కడి ఓహియో రాష్ట్రం ఓరెగాన్ జిల్లాలోని డేటన్‌ నగరంలో ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో 9 మంది మరణించగా.. 27 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి నిందితుడిని మట్టుబెట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

ఓహియో రాష్ట్రం మంచి పర్యాటక ప్రాంతం. అక్కడ బార్లు, రెస్టారెంట్లు ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతమంతా ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. ఆదివారం ఉదయం ఆ ఉన్మాది ఒక్కసారిగా కాల్పులకు పాల్పడడంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. మూడు రోజుల క్రితం కూడా ఇక్కడ ఓ యువకుడు కాల్పులు జరిపిన ఘటనలో ముగ్గురు పౌరులు మరణించారు.

వాల్‌మార్ట్ స్టోర్‌లోనూ రక్తపాతం…

టెక్సాస్‌లోని వాల్‌మార్ట్ స్టోర్‌లో కూడా ఓ దుండగుడు ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో  20 మంది మరణించగా.. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమాచారం తెలియగానే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడ్ని తమ అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 12:45 గంటల ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. వీకెండ్ కావడంతో ఎల్ పాసో సమీపంలోని సియాలో విస్టాలో ఉన్న వాల్‌మార్ట్ స్టోర్ బాగా రద్దీగా ఉంది. ఆ సమయంలో కనీసం 3 వేల మంది వరకు అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. 

అదే సమయంలో ఓ యువకుడు(21) రైఫిల్‌తో స్టోర్‌లోనికి ప్రవేశించి కనిపించిన వాళ్లని కనిపించినట్టు కాల్చి పారేశాడు. కాసేపు అరుపులు, కేకలు, బుల్లెట్ల శబ్దాలతో స్టోర్ దద్దరిల్లిపోయింది. అసలేం జరుగుతుందో అర్థం అయ్యేలోపలే పలువురి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. 

మృతుల్లో ఎక్కువమంది మెక్సికన్లే ఉన్నారు. దీంతో మెక్సికన్లను అసహ్యించుకునే స్థానిక అమెరికన్ ఈ కాల్పులకు తెగబడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కొంతసేపటి తరువాత విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడిన యువకుడిని ప్యాట్రిక్ క్రూసియస్‌గా పోలీసులు గుర్తించారు. డల్లాస్ శివార్లలోని అల్లెన్ ప్రాంతంలో అతడు నివాసం ఉంటున్నట్లు పేర్కొన్నారు.

రైఫిల్ ను చేత్తో పట్టుకుని షాపింగ్ స్టోర్ లోకి ప్రవేశించిన ప్యాట్రిక్.. మెక్సికన్లను లక్ష్యంగా చేసుకుని యథేచ్ఛగా కాల్పులు జరిపాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకే ఓహియో రాష్ట్రంలోనూ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.