అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి, మరో ఐదుగురికి గాయాలు

2:24 pm, Mon, 7 October 19
gun-fire-in-america-cansas-city-bar

వాషింగ్టన్: అమెరికాలోని కన్సాస్ సిటీలోని ఓ బార్‌లో ఆదివారం అర్థరాత్రి ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కాల్పుల్లో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 

సిటీలోని టకీలా కేసీ బార్‌లోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు అక్కడున్న వారితో గొడవపడ్డారని, అనంతరం బయటికి వెళ్లిన వారు వెంటనే తుపాకులతో ప్రత్యక్షమై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని, ఆ తరువాత అక్కడ్నించి పరారయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 

నిందితుల కోసం గాలింపు జరుపుతున్న పోలీసులు.. ఆ దుండగులు ఎవరితో గొడవ పడ్డారు? ఎందుకు కాల్పులు జరిపి ఉంటారు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

రెండేళ్ల క్రితం ఇదే నగరంలో…

ఇదే నగరంలోని ఓ బార్‌లో 2017 ఫిబ్రవరి 22న కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఆ దుర్ఘటనలో భారతీయ అమెరికన్ కూచిబొట్ల శ్రీనివాస్ మరణించాడు. తన స్నేహితుడు అలోక్ మాదసానితో కలిసి బార్‌లో ఉన్న సమయంలోనే ప్యురింటన్ అనే వ్యక్తి కూచిబొట్ల శ్రీనివాస్‌ను కాల్చి చంపాడు. 

ఆ ఘటన అప్పట్లో అటు అమెరికాతోపాటు ఇటు ఇండియాలోనూ కలకలం రేపింది. ఇక ఈ నగరంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కావంటూ అప్పట్లో ఆ నగర మేయర్ కూడా హామీ ఇచ్చారు. అయితే రెండేళ్లు దాటిన తరువాత మళ్లీ అదే నగరంలోని బార్‌లో తాజాగా కాల్పుల ఘటన చోటుచేసుకోవడం, ఈసారి నలుగురు మరణించడం దురదృష్టకరం.