ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి: చిగురుపాటి జయరామ్ హత్య కేసుపై ఎస్పీ, పూర్తి వివరాలివే…

- Advertisement -

jayaram murder

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎన్నారై పారిశ్రామికవేత్త, కోస్టల్ బ్యాంకు ఎండీ చిగురుపాటి జయరామ్ హత్య కేసును సుదీర్ఘ విచారణ అనంతరం పోలీసులు ఛేధించారు. జయరామ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి అని తేల్చారు. అతనితో పాటు మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు.

నందిగామలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హత్య కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ త్రిపాఠి వెల్లడించారు. జయరామ్ హత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేశామని, అన్ని చోట్ల నుంచి సీసీటీవీ ఫుటేజ్ సేకరించామని తెలిపారు. రాకేష్ రెడ్డి రూ. 4 కోట్లు జయరామ్‌కు అప్పుగా ఇచ్చాడు.

చదవండి: జయరామ్ మృతి: హత్య తరువాత పోలీసుల సాయం! రాకేష్ రెడ్డి వెల్లడి! ఆ ఇద్దరు ఎవరు!

తన అద్దాల కంపెనీ ఇబ్బందుల్లో ఉన్నందు వల్ల రాకేష్ వద్ద అప్పు తీసుకున్నాడు జయరామ్. అప్పు సకాలంలో చెల్లించకపోతే తన ఇల్లు తీసుకోమంటూ జయరామ్ అగ్రిమెంట్ రాసినట్లు ఎస్పీ తెలిపారు. కాగా, జయరామ్ తీసుకున్న అప్పు వడ్డీతో కలిపి రూ.6 కోట్లు అయింది.

జయరామ్‌ తీసుకున్న అప్పు సకాలంలో చెల్లించకపోవడం, ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడంతో రాకేష్ రెడ్డికి కోపం పెరిగింది. జనవరి 29న అమెరికా నుంచి వచ్చిన జయరామ్.. నేరుగా శిఖా విల్లాకు వెళ్లాడు. జయరామ్ ఇండియాకు వచ్చిన విషయాన్ని విల్లా మేనేజర్ ద్వారా రాకేష్ రెడ్డికి సమాచారం అందింది.

అతన్ని తన ఇంటికి రప్పించడానికి రాకేష్ రెడ్డి కొత్త ప్లాన్ వేశాడు. రీనా అనే అమ్మాయి పేరుతో వాట్సాప్ నంబర్ ద్వారా జయరాంకు మెసేజ్‌లు పెట్టాడు రాకేష్. అమ్మయి మెసేజ్ చూడగానే జయరాం తన కారులో ఆమె రమ్మన్న ఇంటికి వెళ్లారని ఎస్పీ మీడియాకు వెల్లడించారు.

రాకేష్ రెడ్డి దాడి.. జయరాం మృతి…

తీరా వెళ్లిన తరువాత అక్కడ రాకేష్ రెడ్డి కనిపించాడు.. తన డబ్బుల గురించి అడిగాడు. గొడవ జరిగింది. దీంతో రాత్రంతా జయరామ్‌ను అక్కడే బంధించారు. డబ్బుల కోసం జయరామ్ చాలా మందికి ఫోన్ చేశాడు. అయితే, అతడి సంస్థలో మాజీ ఉద్యోగి అయిన ఈశ్వర ప్రసాద్ మాత్రమే రూ.6 లక్షలు ఇచ్చారు.

జనవరి 31 ఉదయం వరకు చూసిన రాకేష్ రెడ్డి.. ఆ తర్వాత జరిగిన గొడవలో జయరామ్‌పై దాడి చేశాడు. ఆ దెబ్బలతో జయరామ్ చనిపోయాడు. మృతదేహాన్ని తరలించడానికి వాచ్‌మన్ శ్రీనివాస్ సహాయం తీసుకున్నాడు రాకేష్ రెడ్డి. దీంతో ఈ కేసులో రాకేష్ రెడ్డితోపాటు శ్రీనివాస్‌ను కూడా అరెస్ట్ చేశామని ఎస్పీ త్రిపాఠి తెలిపారు.

రాకేష్ రెడ్డితో శిఖా చౌదరికి ఇలా పరిచయం…

ఇదిలా ఉంటే.. టెక్ట్రాన్ కంపెనీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు శిఖా చౌదరి, రాకేష్ రెడ్డిల మధ్య పరిచయం ఏర్పడింది. ఈ కేసులో శిఖా చౌదరిని కూడా ప్రశ్నించామని, కానీ ఆమె పాత్ర ఏమీలేదని తేలిందని ఎస్పీ వెల్లడించారు. అయితే, రాకేష్ రెడ్డికి ఇద్దరు పోలీసు అధికారులు సహకరించినట్లు తేలిందన్నారు.

హత్య జరిగిన తరువాత ఆ ఇద్దరు పోలీసులతో రాకేష్ రెడ్డి సంభాషించినట్లు కాల్ డేటా ఆధారంగా బయటపడిందని కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠి వివరించారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని ఎస్పీ తెలిపారు.

 

- Advertisement -