ముగిసిన ‘తానా’ 22వ మహాసభలు: ఒడిదొడుకులు ఎదురైనా అనుకున్నది సాధించామన్న సతీశ్ వేమన..

satish-vemana-on-stage-in-tana-22nd-conference
- Advertisement -

వాషింగ్టన్ డీసీ: ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ 22వ మహాసభలు (4 జూలై – 6 జూలై)  వాషింగ్టన్‌ డీసీలో ఘనంగా ముగిశాయి. సంఘం అధ్యక్షుడు సతీష్‌ వేమన సారధ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ‘తానా’ చరిత్రలోనే రికార్డును సృష్టించింది.

వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన ఈ మహాసభలకు ఈసారి అత్యధికంగా దాదాపు 20 వేల నుంచి 25 వేల మంది హాజరయ్యారు. అమెరికాలో జరిగిన ఓ తెలుగు మహాసభలకు ఇంతమంది రావడం ఇదే తొలిసారి.

ఇక ‘తానా’ 22వ సభల ముగింపు సమావేశంలో అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగిన సతీష్‌ వేమన.. తన హయాంలో సంఘం ద్వారా చేపట్టిన పలు కార్యక్రమాలను గుర్తుచేసుకున్నారు.

ఇంతటి భారీ స్థాయిలో 22వ తానా మహాసభలను నిర్వహించడంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదురయ్యాయని, అయినప్పటికీ ‘తానా’ లక్ష్యాలు, ఆశయసాధనలో విజయం సాధించడం గర్వంగా ఉందని చెప్పారు.

‘తానా’ టీమ్‌ స్క్వేర్‌ ద్వారా దాదాపు 200 డెడ్ బాడీలను వారి వారి స్వస్థలాలకు పంపించగలిగామని, అలాగే ఫుడ్‌డ్రైవ్‌, బ్యాక్‌ప్యాక్‌ ద్వారా నిరుపేద పిల్లలకు స్కూల్‌ బ్యాగ్‌ల పంపిణీ, వైద్యచికిత్సలు, హ్యూస్టన్‌ నగరంలో హరికేన్‌ కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకున్నామని ఆయన పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ‘తానా’ తరఫున…

తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘తానా’ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలను చేశామని, ఎన్నో సంస్థలకు చేయూతను ఇచ్చామని సతీశ్ వేమన చెప్పారు. వైజాగ్‌‌లో తుపాన్‌ సంభవించినప్పుడు.. సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నామని, అలాగే ప్రభుత్వ స్కూళ్ళలో డిజిటల్‌ తరగతి గదుల ఏర్పాటుకు కృషి చేశామని చెప్పారు.

కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ళలో రూ.60 లక్షల వ్యయంతో స్త్రీ శక్తి భవన్‌ను నిర్మించామని, ఇంకా ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశామని, తనకు సహకరించిన మిత్రులు, ‘తానా’ సభ్యులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని సతీష్ వేమన అన్నారు.

కొత్త అధ్యక్షుడి సారథ్యంలో ‘తానా’ సేవలు ఇకమీదట కూడా నిరంతరాయంగా కొనసాగాలని తాను కోరుకుంటున్నానని, అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని పేర్కొన్న ఆయన.. తాను పదవిలో ఉన్నా లేకపోయినా తెలుగు వాళ్ళకు సేవలందించడలో ఎల్లవేళలా ముందుంటానని చెప్పారు.

- Advertisement -