అమెరికాలో తెలంగాణ యువతి మృతి! అత్తింటి వేధింపులే కారణమా?

6:37 pm, Tue, 9 April 19
sandhya-suspicious-death-in-tennessee

హైదరాబాద్: తెలంగాణకు చెందిన ఓ యువతి అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆ యువతికి 9 నెలల క్రితమే వివాహంకాగా భర్తతో కలిసి అక్కడి టెన్నెస్సీలోని మెంఫిస్‌ నగరంలో నివసిస్తోంది. ఆమె బాత్రూమ్‌లో మరణించిందంటూ ఆమె భర్త తన అత్తింటి వారికి శనివారం సమాచారం అందించాడు.

అయితే తమ కుమార్తె మృతికి భర్త, అత్తమామలు పెట్టిన కట్న వేధింపులే కారణమని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చింతలపల్లికి చెందిన సెగ్గెం మహేందర్‌, విమలమ్మ దంపతుల చిన్న కుమార్తె సంధ్య(25)ను తొమ్మిది నెలల క్రితం నర్సింహులపేట మండలం వేములపల్లికి చెందిన శ్రీకాంత్‌కు ఇచ్చి వివాహం జరిపించారు.

అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ వివాహానంతరం సంధ్యను అక్కడికి తీసుకెళ్లాడు. శ్రీకాంత్ తల్లిదండ్రులు కూడా అక్కడే ఉంటున్నారు.

శనివారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో అమెరికా నుంచి శ్రీకాంత్ ఫోన్ చేశాడు. మీ అమ్మాయి బాత్రూంలో చనిపోయి కనిపించిందంటూ సంధ్య తండ్రి మహేందర్‌కు సమాచారం అందించాడు. నర్సింహులపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మహేందర్ వెంటనే తొర్రూరు పోలీసులకు ఈ మేరకు సమాచారం అందించారు.

రెండు నెలలుగా అదనపు కట్నం కోసం శ్రీకాంత్ తన కూతురు సంధ్యను వేధిస్తున్నాడని మహేందర్‌ ఆరోపించారు. అయితే సంధ్య భర్త శ్రీకాంత్ మాత్రం ఆమె గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని తన బంధువులకు చెబుతున్నాడు. అయిదే ఇది ఆత్మహత్య అయి ఉండదని, హత్య అయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.