అమెరికాలో అగ్నిప్రమాదం.. ముగ్గురు తెలంగాణ టీనేజర్లు మృతి

2:27 pm, Wed, 2 January 19

three-telangana-teenagers-died-in-usa

వాషింగ్టన్: ముగ్గురు తోబుట్టువులు.. వారి వయసు కేవలం 14 నుంచి 17 ఏళ్లలోపే.. స్కాలర్‌షిప్‌పై చదువుకునేందుకు తెలంగాణ నుంచి అమెరికా వెళ్లారు.. కానీ తిరిగిరాని లోకాలకు చేరారు. క్రిస్మస్ పర్వదినాన అమెరికాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నల్గొండ జిల్లాకు చెందిన ముగ్గురు టీనేజర్లు సాత్వికా నాయక్, సుహాస్ నాయక్, జయ్‌ ఓ అగ్నిప్రమాదంలో మృతి చెందారు.

వీరితోపాటు కారీ కూడ్రిట్(46) అనే అమెరికన్ మహిళ కూడా మృత్యువాత పడింది. ఇంకా ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. మృతి చెందిన టీనేజర్లు నల్లొండ జిల్లాలోని ఆడిశర్లపల్లి మండలం గుర్రపుతండాకు చెందినవారు.

క్రిస్మస్ వేడుకల నిమిత్తం…

క్రిస్మస్ వేడుకల నిమిత్తం తల్లిదండ్రులు భారత్‌కు‌రాగా కొలిర్‌విలీలోని చర్చిలో ప్రార్థనలు చేసిన అనంతరం తమ కుటుంబ స్నేహితులైనకారిక్రూడిట్‌ ఇంటికి సాత్వికా నాయక్, సుహాస్ నాయక్, జయ్‌ వెళ్లారు. నిద్రిస్తున్న సమయంలో అగ్రిప్రమాదం జరగడంతో వీరు తప్పించుకోలేకపోయారు. మంటలకు ముగ్గురూ ఆహుతయ్యారు.

వీరిని తమ ఇంటికి ఆహ్వానించిన కారి క్రూడిట్ కూడా ప్రమాదంలో మరణించగా, ఆమె భర్త, కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల సమయంలో జరిగిన ఈ అగ్నిప్రమాదం ధాటికి కారిక్రూడిట్ ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఇంట్లోని సామగ్రి మొత్తం  కాలిబూడిదయింది.

ప్రమాదంపై సమాచారం అందుకుని అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తీవ్రంగా గాయపడ్డ తండ్రి, కొడుకును వారు హుటహుటిన హాస్పిటల్‌కు తరలించారు. తమ ముగ్గురు పిల్లలు ఒకేసారి చనిపోయారని తెలియడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.