అమెరికాలో తొట్టపిల్లి కుటుంబం అదృశ్యం విషాదంతం, ఈల్ నదిలో నలుగురి మృతదేహాలు లభ్యం

- Advertisement -

కాలిఫోర్నియా: అమెరికాలో కొద్ది రోజుల క్రితం అదృశ్యమైన భారతీయ కుటుంబం కథ చివరికి విషాదాంతంగా ముగిసింది. కాలిఫోర్నియాలోని శాంటాక్లారిటలో స్థిరపడిన సందీప్ తొట్టపిల్లి కుటుంబంలోని నలుగురి మృతదేహాలు ఓ నదిలో లభ్యమయ్యాయి.

సందీప్ తొట్టపిల్లి, ఆయన భార్య సౌమ్య, వారి పిల్లలు సిద్ధాంత్, సాచీలు కొద్ది రోజుల క్రితం తమ ఎస్‌యూవీలో బయలుదేరి మార్గం మధ్యలో అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ కుటుంబం ఆచూకీ కోసం పోలీసులు, సహాయక బృందాలు విస్తృతంగా గాలింపు చేపట్టాయి. చివరకు కాలిఫోర్నియాలోని ఈల్ నదిలో పడిపోయిన ఎస్‌యూవీలో రెండు మృతదేహాలను కనుగొన్నట్లు అధికారులు సోమవారం తెలిపారు.

- Advertisement -

ఆ మృతదేహాలను సందీప్ తొట్టపిల్లి(41), సాచి తొట్టపిల్లి(9)గా పోలీసులు గుర్తించారు. గత శుక్రవారం ఇదే నదిలో సౌమ్య(38) తొట్టపిల్లి మృతదేహం లభించిందని వారు పేర్కొన్నారు. అయితే సందీప్, సౌమ్య దంపతుల కుమారుడు సిద్ధాంత్ తొట్టపిల్లి(12) ఆచూకీ మాత్రం తొలుత లభించలేదని, అతడి కోసం ఈల్ నదిలో 20 మంది సభ్యుల బృందం గాలించిందని, చివరికి అతడి మృతదేహం కూడా సోమవారం సాయంత్రం లభ్యమైందని తెలిపారు.

తొట్టపిల్లి కుటుంబం ఏప్రిల్ 8 నుంచి కనిపించకుండా పోయింది. సందీప్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ శాంటాక్లారిటా వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 8న సందీప్ తన కుటుంబంతో కలిసి తమ ఎస్‌యూవీలో ఓరెగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్ నుంచి శాన్‌జోస్‌లోని తమ బంధువుల ఇంటికి బయలుదేరారని, అయితే వీరి కుటుంబం మధ్యలోనే అదృశ్యమైందని పోలీసులు తెలిపారు.

సందీప్‌ తొట్టపిల్లి తల్లిదండ్రులు గుజరాత్‌లో ఉన్నారు. గుజరాత్‌లోనే పెరిగిన సందీప్‌ పదిహేనేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆయన భార్య సౌమ్య స్వస్థలం కేరళలోని కొచ్చి. సందీప్ తొట్టపిల్లి కుటుంబం మరణ వార్త గుజరాత్‌లోని సందీప్‌ కుటుంబ సభ్యులు, బంధువుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

- Advertisement -