మీ బీపీ ఎంతో మీరు తీసుకునే సెల్ఫీ చెప్పేస్తుంది!

3:13 pm, Wed, 7 August 19

న్యూఢిల్లీ: సాంకేతికత రోజురోజుకు ఎంతలా పెరిగిపోతోందో చెప్పేందుకు ఇదే ఉదాహరణ. బీపీ చెక్ చేసుకోవాలంటే ఆసుపత్రికి వెళ్లాలి. లేదంటే మెడికల్ షాపులో దొరికే చిన్నపాటి బీపీ టెస్టింగ్ మిషన్ కొనుక్కోవాలి. ఇప్పుడు స్మార్ట్‌వాచ్‌లు కూడా ఆ పనిచేసి పెడుతున్నాయి. ఇప్పుడా అవసరం లేకుండా ఓ సెల్ఫీతో ఎంచక్కా మన రక్తపోటు (బీపీ)ని తెలుసుకునే వెసులుబాటు వచ్చేసింది.

కెనడా, చైనా దేశాలకు చెందిన పరిశోధకులు బీపీని తెలుసుకునేందుకు ఓ వినూత్నమైన సాంకేతికతను ఆవిష్కరించారు. ట్రాన్స్‌డెర్మల్ ఆప్టికల్ ఇమేజింగ్ అనే సరికొత్త సాంకేతికతను కనుగొన్నారు. స్మార్ట్‌ఫోన్‌తో సెల్ఫీ తీసుకునేటప్పుడు దాని ద్వారా వెలువడే కిరణాల ఆధారంగా, శరీరం మీద ఉండే ప్రోటీన్స్‌ని ఇది గుర్తిస్తుంది. అనంతరం మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ద్వారా బ్లడ్ ప్రెషర్ ఎంత ఉందో తెలుసుకోవచ్చన్నమాట.

ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ టెక్నాలజీ మన శరీర తత్వాన్ని ఆధారంగా చేసుకొని కచ్చితమైన ఫలితాలు చూపిస్తుంది. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మరింత సమయం పడుతుంది. అయితే ఇటీవలి కాలంలో మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేక రంగాలలో కీలకమైన పాత్ర పోషిస్తోంది.

ఈ తరుణంలో ఇలాంటి సరికొత్త పద్ధతులు అనేకం అందుబాటులోకి రాబోతున్నాయి. వివిధ రకాల జబ్బులు రాక ముందే గుర్తించడం కూడా సాధ్యమవుతోంది. ఇలాంటి సాంకేతిక వల్ల మనుషుల జీవన ప్రమాణాలు పెరుగుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదని నిపుణులు చెబుతున్నారు.