జియో ఖాతాదారులకు గుడ్ న్యూస్.. 100 ఉచిత నిమిషాలు, ఎస్సెమ్మెస్‌లు ఉచితం

5:45 pm, Tue, 31 March 20

ముంబై: దేశంలోని అతిపెద్ద టెలికం సంస్థలలో ఒకటైన రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది.

ఇతర నెట్‌వర్క్‌ల బాటలోనే నడుస్తూ తమ ఖాతాదారులకు 100 నిమిషాల టాక్‌టైంతోపాటు 100 మెసేజ్‌లను ఉచితంగా ఇవ్వనున్నట్టు తెలిపింది.

వినియోగదారుల చెల్లుబాటు గడువు ముగిసిన తర్వాత కూడా ఇన్‌కమింగ్ కాల్స్‌ను అందుకోవచ్చని పేర్కొంది.

ఏప్రిల్ 17వ తేదీ వరకు కాల్స్, ఎస్సెమ్మెస్ సౌకర్యం ఉచితంగా అందుబాటులో ఉంటుందని జియో తెలిపింది.

ప్రస్తుత క్లిష్ట సమయంలో తమ వినియోగదారులు రీచార్జ్ చేసుకోలేకపోతున్నారని, అందుకనే ఉచిత కాల్స్, ఎస్సెమ్మెస్ సౌకర్యాన్ని కల్పించినట్టు తెలిపింది. ఇది వారికెంతో ప్రయోజనకరంగా మారనుందని పేర్కొంది.

రీచార్జ్ కోసం యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి ఆన్‌‌లైన్ ఆప్షన్లతోపాటు ఏటీఎంలను ఉపయోగించి రీచార్జ్ చేసుకునే సుదుపాయాన్ని అందించేందుకు బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు జియో తెలిపింది.

గడువు ముగిసిన తర్వాత కూడా వినియోగదారులు ఇన్‌కమింగ్ కాల్స్ అందుకోవచ్చని వివరించింది.

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఏప్రిల్ 10 వరకు తమ ప్రీపెయిడ్ వినియోగదారులకు గడువు పొడిగించడంతో పది రూపాయల టాక్‌టైం కూడా అందిస్తున్నట్టు ప్రకటించింది.

ఆ వెంటనే భారతీ ఎయిర్‌టెల్ కూడా ఏప్రిల్ 17 వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.