శాంసంగ్ నుంచి రెండు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు.. త్వరలో విడుదల

10:08 pm, Tue, 26 May 20

న్యూఢిల్లీ: గెలాక్సీ ఎం సిరీస్‌లో భారత్‌లో రెండు నయా స్మార్ట్‌ఫోన్లు విడుదల చేసేందుకు శాంసంగ్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో రూ. 15 వేల లోపు ధరలో వీటిని విక్రయించనున్న శాంసంగ్ మరికొన్ని రోజుల్లోనే భారత్‌లో విడుదల చేయనున్నట్టు సమాచారం.

గెలాక్సీ ఎం01, గెలాక్సీ ఎం11 పేరుతో వస్తున్న వీటిని ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లోనూ విక్రయించేందుకు సిద్ధమవుతోంది.

గెలాక్సీ ఎం1 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. దీని ధర రూ. 10వేల లోపు ఉండే అవకాశం ఉంది. అలాగే, 3జీబీ ర్యామ్, 32జీబీ మెమొరీ సింగిల్ వేరియంట్‌లో రానుంది.

డ్యూయల్ కెమెరా సెటప్, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. గెలాక్సీ ఎం11 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రానుంది.

ఇందులో 3జీబీ/32జీబీ, 4జీబీ/64 జీబీ వేరియంట్లు ఉన్నాయి. ధర రూ. 10 వేల నుంచి రూ. 15 వేల మధ్యలో ఉండే అవకాశం ఉంది.

ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, అలాగే ఇందులో మిగతా ఫోన్లలా కాకుండా స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ను ఉపయోగించినట్టు తెలుస్తోంది.