భారత్‌లో విడుదలైన వివో జడ్1ఎక్స్.. 5 నిమిషాల చార్జింగ్‌తో మూడు గంటల టాక్‌టైం!

న్యూఢిల్లీ: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఆకర్షిస్తున్నవి రెండే రెండు. అందులో ఒకటి కెమెరా కాగా, రెండోది బ్యాటరీ సామర్థ్యం. ఈ రెండే ఇప్పుడు కొనుగోలుదారులకు ప్రముఖంగా మారాయి. వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ కంపెనీలన్నీ వాటికే ప్రాధాన్యం ఇస్తున్నాయి.

ఫోన్ ఎంత గొప్పదైనా బ్యాటరీ సామర్థ్యం తక్కువైతే వినియోగదారులు అటువైపు చూడడం లేదు. అందుకే ఇప్పుడు మొబైల్ మేకర్స్ అన్నీ అటువైపు దృష్టి సారించాయి. అయితే, తాజాగా, శనివారం మార్కెట్లోకి వచ్చిన ‘వివో జడ్1ఎక్స్’ ఈ కోవకే చెందుతుంది. ఈ ఫోన్‌లో పవర్‌ఫుల్ బ్యాటరీని ఉపయోగించారు.

అంతేకాదు, 22.5 ఫ్లాష్ చార్జ్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ ఫోన్‌ను కేవలం ఐదు నిమిషాలు చార్జ్ చేయడం ద్వారా ఏకంగా మూడు గంటలు మాట్లాడుకోవచ్చు. అలాగే, 48 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా ఈ ఫోన్‌కు ఉన్న మరో అద్భుత ఆకర్షణ

ధర.. ఆఫర్ల వివరాలు

వివో జడ్1ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లో మూడు వేరియంట్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం రెండు మాత్రమే భారత వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. 6జీబీ ర్యామ్/64 జీబీ అంతర్గత మెమొరీ రకం ధర రూ. 16,990 కాగా, 6జీబీ ర్యామ్/128 జీబీ వేరియంట్ ధర రూ.18,990. 8జీబీ ర్యామ్ చైనాలో అందుబాటులో ఉన్నప్పటికీ భారత వినియోగదారులకు అందుబాటులోకి వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

వివో జడ్1ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్ల ద్వారా ఈ నెల 13 నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డు, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా కొనుగోలు చేసే వారికి రూ.1250 రాయితీ లభిస్తుంది. జియో నుంచి రూ.6,000 విలువైన ప్రయోజనాలు లభిస్తుంది.

వివో జడ్1ఎక్స్ స్పెసిఫికేషన్లు:

* డ్యూయల్ సిమ్
* ఆండ్రాయిడ్ 9.0 ఓఎస్
* 6.38 అంగుళాల ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
* వాటార్ డ్రాప్ నాచ్
* స్నాప్‌డ్రాగన్ 712 ఎస్ఓసీ
* 48 ఎంపీ +8ఎంపీ +2ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా
* 32 ఎంపీ సెల్ఫీ కెమెరా
* 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ