వివో నుంచి ‘జడ్3ఎక్స్’: అత్యద్భుత ఫీచర్లు.. అతి తక్కువ ధర…

12:58 pm, Tue, 30 April 19
Vivo-Z3x

షాంఘై: భారత మొబైల్ విఫణిలో చైనా కంపెనీల మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు రోజుకో కొత్త మోడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. ముఖ్యంగా కెమెరా విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాయి.

రియర్, సెల్ఫీ కెమెరాల సామర్థ్యాన్ని అనూహ్యంగా పెంచేస్తున్నాయి. వినియోగదారులు కూడా ఇవే కోరుకుంటుండడంతో కెమెరా, ర్యామ్, ఇన్‌బిల్ట్ మెమొరీలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి.

అయితే, ఈ ఫీచర్లు ఉన్న ఫోన్ల ఖరీదు కూడా ఎక్కువగా ఉండడంతో ఒక వర్గం వినియోగదారులు మాత్రమే వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ఫీచర్లు ఉన్న ఫోన్‌ను అతి తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చింది వివో.

వివో జడ్3ఎక్స్ పేరుతో చైనాలో విడుదల చేసిన ఈఫోన్‌ను త్వరలోనే భారతీయ మార్కెట్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. స్నాప్‌డ్రాగన్ 660 ఎస్‌వోసీ, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 6.26 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, నాచ్ డిజైన్ వంటి ఫీచర్లను దీనికి జోడించింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా వివో జడ్3ఎక్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. అలాగే, వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫన్‌టెక్ ఓఎస్‌ 9తో కూడిన ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టం ఇందులో ఉన్నాయి.

ధర ఇలా..

చైనాలో ఈ ఫోన్ 4జీబీ ర్యామ్+64 జీబీ ఆన్‌బోర్డ్ మెమొరీ వేరియంట్ ధర 1,198 చైనీస్ యువాన్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.12,400 ఉండే అవకాశం ఉంది.

రెడ్, పర్పుల్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. మే 1 నుంచి ప్రీ ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి. ఆన్‌లైన్ స్టోర్లలో మే 8 నుంచి వినియోగదారులకు అందుబాటులో రానుంది.

వివో జడ్3ఎక్స్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

6.26 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 660 ఎస్ఓసీ, 4జీబీ ర్యామ్, 13 మెగాపిక్సల్ +2 మెగాపిక్సల్ డ్యూయల్ రియర్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 64 జీబీ ఇన్‌బిల్ట్ మెమొరీ, 256 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, ఫింగర్ ప్రింట్, ప్రాక్సిమిటీ సెన్సార్లు వంటి ఫీచర్లు ఉన్న ఈ ఫోన్‌లో 3,260 సామర్థ్యం కలిగిన బ్యాటరీని ఉపయోగించారు.