షావోమీ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. డ్యూయల్ రియర్ కెమెరాతో వచ్చేసిన రెడ్‌మి 8

12:56 pm, Wed, 9 October 19

న్యూఢిల్లీ: చైనీస్ మొబైల్ మేకర్ షావోమీ నుంచి మరో ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది. రెడ్‌మి 7కి సక్సెసర్‌గా తీసుకొచ్చిన రెడ్‌మి 8ను బుధవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. డ్యూయల్ రియర్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, యూఎస్‌బీ టైప్-సి పోర్టు వంటి ప్రత్యేకతలు ఈ ఫోన్‌లో ఉన్నాయి. వెనకవైపు ‘ఔరా మిర్రర్ డిజైన్’తో ఆకర్షణీయంగా ఉంది.

రెడ్‌మి 8 ధర, సేల్ వివరాలు..

రెడ్‌మి 8 3జీబీ ర్యామ్+ 32జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 7,999 కాగా, 4జీబీ ర్యామ్+ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,999. ప్రారంభం ఆఫర్‌లో భాగంగా మొదటి 50 లక్షల వినియోగదారులకు ఈ వేరియంట్‌ను రూ. 7,999కే అందిస్తున్నట్టు షావోమీ ప్రకటించింది.

3 జీబీ వేరియంట్‌కు ఆర్డర్ చేసిన వినియోగదారులు 4జీ వేరియంట్ కోసం అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని తెలిపింది. శనివారం అర్ధ రాత్రి 12 గంటల నుంచి ఈ ఫోన్ విక్రయానికి సిద్ధంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9పై ఓఎస్, 6.22 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డాట్ నాట్ డిస్‌ప్లే, కార్నింగ్ గ్లాస్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 439 ఎస్ఓసీ చిప్‌సెట్, 12 ఎంపీ + 2 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లు, ఫేస్‌ అన్‌లాక్ ఉన్న ఈ ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు.