డీపీఎల్‌లో చితక్కొట్టిన సౌమ్య సర్కార్.. 16 సిక్సర్లతో 208 పరుగులు

10:15 pm, Wed, 24 April 19

ఢాకా: బంగ్లాదేశ్ ఆటగాడు సౌమ్య సర్కారు చెలరేగిపోయాడు. పూనకం వచ్చినట్టు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఢాకా ప్రీమియర్ లీగ్‌ (డీపీఎల్)లో భాగంగా షేక్ జమాల్ ధన్‌మోండి క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌమ్య సర్కార్ బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు. అబహానీ లిమిటెడ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 26 ఏళ్ల సర్కార్ 153 బంతుల్లో 16 సిక్సర్లు 14 ఫోర్లతో 208 (నాటౌట్) పరుగులు చేశాడు. అంతేకాదు, జహురుల్ ఇస్లాంతో కలిసి తొలి వికెట్‌కు 312 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పాడు. 318 పరుగుల విజయ లక్ష్యంతో క్రీజులోకి దిగిన అబహానీ లిమిటెడ్ జట్టు సౌమ్య సర్కార్, జహురుల్ దెబ్బకు మరో 17 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుని డీపీఎల్ టైటిల్ విజేతగా నిలిచింది. వంద బంతులు ఎదుర్కొన్న జహురుల్ 128 పరుగులు చేశాడు.

డబుల్ సెంచరీ బాదిన సౌమ్య సర్కార్ అరుదైన రికార్డును తన పేర లిఖించుకున్నాడు. లిస్ట్-ఎ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. 2017లో అకీబుల్ హసన్ 190 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు అదే అత్యుత్తమం కాగా, ఇప్పుడా రికార్డును సౌమ్య సర్కార్ బద్దలుగొట్టాడు.