కరోనా మహమ్మారిపై పోరుకు రూ.51 కోట్ల విరాళం ప్రకటించిన బీసీసీఐ, ఇంకా క్రికెటర్లు కూడా…

9:15 pm, Mon, 30 March 20

ముంబై: దేశాన్ని భయం గుప్పిట్లోకి నెట్టిన కరోనా వైరస్‌పై పోరుకు దేశం మొత్తం ఏకమైంది. సామాన్యులు, సెలబ్రిటీలు, క్రికెటర్లు, వ్యాపారవేత్తలు, కంపెనీలు.. ఇలా అన్నీ తమకు తోచినంత సాయం ప్రకటిస్తూ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు.

చదవండి: కరోనాపై కోటి సాంగ్.. అభినయించిన చిరు, నాగ్, వరుణ్ తేజ్, సాయితేజ్

విపత్కర సమయంలో ఏకతాటిపైకి వచ్చి కోవిడ్ మహమ్మారిపై యుద్ధం ప్రకటించారు. ఇక, తాజాగా మాజీ క్రికెటర్లు అయితే ఈ విషయంలో చాలా స్ఫూర్తిగా నిలుస్తున్నారు.  తమకు తోచినంత సాయం ప్రకటిస్తూ మేమున్నామని హామీ ఇస్తున్నారు.

క్రికెటర్లు, అసోసియేషన్ల భూరి విరాళాలు…

తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ పీఎం కేర్స్ ఫండ్‌కు రూ. 51 కోట్ల విరాళం ప్రకటించింది. టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రూ. 50 లక్షల విరాళం ప్రకటించగా, మాజీ కెప్టెన్, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ పేదల కోసం రూ. 50 లక్షల విలువైన బియ్యాన్ని విరాళంగా ఇచ్చాడు.

చదవండి: హజ్‌ యాత్ర కోసం దాచుకున్న సొమ్మును.. ఆరెస్సెస్ సేవా భారతికి విరాళమిచ్చిన ముస్లిం మహిళ

సురేశ్ రైనా రూ. 52 లక్షలు, అజింక్య రహానే రూ. 10 లక్షల సాయం ప్రకటించాడు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కూడా తన వంతు సాయం అందిస్తానని ముందుకొచ్చాడు.

భారత మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ తన ఎంపీల్యాడ్స్ నిధుల నుంచి రూ. 50 లక్షలు ఖర్చు చేస్తున్నట్టు ప్రకటించారు.

16 ఏళ్ల మహిళా క్రికెటర్ రిచా ఘోష్ లక్ష రూపాయలు ప్రకటించింది. బెంగాల్, ముంబై, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్లు కూడా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించాయి.

చదవండి: పేటీఎం ఫండ్ రైజింగ్ ప్రోగ్రాం.. రూ. 500 కోట్ల విరాళాల సేకరణే లక్ష్యం!