ట్రాఫిక్ జరిమానా కట్టమన్నారని.. బైక్‌ను తగలెట్టేశాడు!

- Advertisement -

న్యూఢిల్లీ: ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ట్రాఫిక్ నిబంధనలు వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. సరైన పత్రాలు లేకపోవడం, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనకు పాల్పడే వారి నుంచి భారీ జరిమానాలు విధిస్తున్నారు.

దీంతో వాహనాలు బయటకు తీయాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. తాజాగా, ఢిల్లీలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిన్న మధ్యాహ్నం ఓ యువకుడు జరిమానా చెల్లించలేక తన ద్విచక్ర వాహనాన్ని అందరి ముందు తగలబెట్టేశాడు.

రాకేశ్ అనే యువకుడు మద్యం తాగి బైక్‌పై వెళ్తూ దొరికిపోయాడు. బ్రీత్ అనలైజర్ టెస్టులో ఆల్కహాల్ శాతం 200 దాటినట్టు తేలింది. మద్యం తాగి బైక్ నడపడం ఓ నేరం అయితే, బైక్‌కు సంబంధించిన ఎటువంటి పత్రాలు అతడి వద్ద లేకపోవడం మరో తప్పు. దీంతో అతడికి పోలీసులు భారీ జరిమానా వడ్డించారు.

జరిమానా చెల్లించేందుకు డబ్బులు లేవని చెప్పడంతో అతడి నుంచి పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకుని పక్కన పార్క్ చేశారు. అయితే, బైక్‌లో విలువైన పత్రాలు ఉన్నాయని, వాటిని తీసుకుంటానని పోలీసులకు చెప్పి బైక్ వద్దకు వెళ్లిన రాకేశ్ పెట్రోలు పైపును లీక్ చేసి నిప్పు పెట్టాడు.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు మంటలు అదుపు చేసి రాకేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -