క్రికెట్‌కు పాకిస్థానే సేఫెస్ట్ ప్లేస్: క్రిస్ గేల్ సంచలన వ్యాఖ్యలు

6:12 pm, Fri, 10 January 20

బంగ్లాదేశ్: విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెట్ ఆడేందుకు పాకిస్థాన్ ఒకటే అత్యంత సురక్షితమైన ప్రదేశమని పేర్కొన్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో చాటగ్రామ్ చాలెంజర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం క్రికెట్ ఆడేందుకు పాకిస్థాన్‌ను మంచిన సురక్షితమైన ప్రదేశం మరొకటి లేదన్నాడు.

తమ దేశంలో పర్యటించేందుకు వచ్చే జట్లకు ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ ఇస్తామని ఆ దేశం చెబుతోందని, దానర్థం మనకి పూర్తి రక్షణ లభిస్తుందని అన్నాడు. బంగ్లాదేశ్‌లోనూ ఆటగాళ్లకు పూర్తి రక్షణ లభిస్తుందన్నాడు.
నిజానికి ఇప్పుడు పాకిస్థాన్‌లో రెండు సిరీస్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ వెళ్లాల్సి ఉంది. అయితే, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు. దీంతో బంగ్లాదేశ్ పర్యటనపై సందిగ్ధత నెలకొంది.

ఐసీసీ నాలుగు రోజుల టెస్టు ప్రతిపాదనపైనా గేల్ స్పందించాడు. ఐదు రోజుల టెస్టు ఇప్పటికే ఓ ట్రెండ్ సెట్ చేసిందని, ఇప్పుడా ఫార్మాట్‌ను మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని గేల్ ప్రశ్నించాడు.
పాకిస్థాన్‌లో పర్యటించిన శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి తర్వాత ఆ దేశంలో పర్యటించేందుకు విదేశీ జట్లు వణికిపోతున్నాయి.

2009న లాహోర్‌లో జరిగిన ఈ దాడి తర్వాత పాకిస్థాన్‌ క్రికెట్ పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో తమ దేశంలో క్రికెట్‌ను పునరుద్ధరించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా పలు దేశాలను ఆహ్వానిస్తోంది.

చివరికి గతేడాది శ్రీలంకతో టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లను విజయవంతంగా నిర్వహించి చూపించింది. ఈ నేపథ్యంలో టెస్టు, టీ20 సిరీస్‌లు ఆడేందుకు రమ్మని బంగ్లాదేశ్‌ను ఆహ్వానించింది. అయితే, బీసీబీ మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.