ప్రపంచ కప్‌ తుది జట్టులో స్థానం దక్కడంపై దినేశ్ కార్తీక్ ఏమన్నాడంటే…

5:49 pm, Tue, 16 April 19
dinesh kartik

ఢిల్లీ: ప్రపంచకప్‌కు భారత తుదిజట్టులో స్థానం దక్కడంపై వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. తన కల సాకారమైందని సంబరపడిపోతున్నాడు.

‘‘ప్రపంచకప్‌కు ఎంపికవడంతో చాలా ఆనందంగా ఉంది. 2019 ప్రపంచకప్‌లో ఆడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను.ఈ రోజు నా కల సాకారమైంది’ అని దినేశ్‌ కార్తీక్‌ మాట్లాడుతున్న వీడియోని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు విడుదల చేసింది.

టీమిండియా వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనికి దన్నుగా రిషబ్ పంత్‌, దినేశ్‌ కార్తీక్‌.. వీరిద్దరిలో ఎవరిని సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేస్తుందోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది.

అయితే పంత్‌ కాకుండా దినేశ్‌ కార్తీక్‌ జట్టులో స్థానం సంపాదించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 33 ఏళ్ల దినేశ్‌ కార్తీక్‌కు ఇది రెండో ప్రపంచకప్‌. 2007లోనూ అతడు ప్రపంచ కప్ టోర్నీలలో ఆడాడు. ఆ తరువాత 12 ఏళ్లలో జరిగిన ప్రపంచ కప్‌ టోర్నీల్లో మాత్రం జట్టులో స్థానం లభించలేదు.

ఈ ఐపీఎల్ సీజన్‌లో దినేశ్‌ కార్తీక్‌ ఏడు మ్యాచుల్లో 111 పరుగులు చేశాడు. మే 30 నుంచి జులై 14 మధ్యలో ఇంగ్లండ్‌లో ప్రపంచ కప్‌ టోర్నీ జరగనుంది. జూన్‌ 5న దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి మ్యాచ్‌ ఆడనుంది.