ఐసీసీ చైర్మన్ పదవికి గంగూలీనే బెస్ట్: పాక్ మాజీ క్రికెటర్

6:12 pm, Sun, 7 June 20

ఇస్లామాబాద్: గంగూలీ ఐసీసీ చైర్మన్ అవ్వాలని కోరుకునే ఆటగాళ్ల జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇటీవల సౌతాఫ్రికా మాజీ ఆటగాడు గ్రేమ్ స్మిత్ మీడియాతో మాట్లాడుతూ గంగూలీ ఐసీసీ చైర్మన్ అయితే బాగుంటుందని చెప్పిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఆ జాబితాలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా చేరుతున్నారు. ఆ పదవికి గంగూలీనే బెస్ట్ అని కితాబు కూడా ఇస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పాకీస్తానీ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా గంగూలీని ఆకాశానికెత్తేశాడు. ఐసీసీ చైర్మన్ పదవికి అతడు సరిగ్గా సరిపోతాడని చెప్పుకొచ్చాడు.

అతడు కెప్టెన్‌గా భారత్‌ను గొప్ప జట్టుగా తీర్చి దిద్దాడని, అదే ఐసీసీ చైర్మన్ అయితే క్రికెట్‌లో గొప్ప మార్పులు తీసుకొస్తాడని పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే స్పాట్ ఫిక్సింగ్ కారణంగా కనేరియా జీవితకాలపై నిషేధం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

అయితే గంగూలీ ఐసీసీ చైర్మన్ అయితే తన బ్యాన్‌పై మళ్లీ అప్పీల్ చేస్తానని, అప్పుడు తనకు సరైన సమాధానం లభిస్తుందన్న నమ్మకం ఉందని పేర్కొన్నాడు.

‘గంగూలీ చాలా గొప్ప ఆటగాడు. ఐసీసీ చైర్మన్‌ పదవికి సరైన వ్యక్తి. గంగూలీ ఐసీసీ చైర్మన్ అయితే నేను నా బ్యాన్‌పై మళ్లీ అప్పీల్ చేస్తా.

అప్పుడు కచ్చితంగా నేను దీని నుంచి బయటపడగలుగుతా’ అంటూ కనేరియా పేర్కొన్నాడు. 

2002లో జరిగిన ఓ ఇంగ్లీష్ కౌంటీ మ్యాచ్ సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు కనేరియాతో పాటు మరికొంత మంది ఆటగాళ్లపై పాక్ క్రికెట్ బోర్డు నిషేధం విధించింది.

అయితే కనేరియా మొదట్లో నేరాన్ని అంగీకరించకపోయినా చివరకు 2018లో ఒప్పుకున్నాడు. దీంతో అతడిపై జీవితకాల నిషేధం పడింది.