రెండో వన్డేలో భారత్ విజయం.. ఆసీస్‌ను దెబ్బతీసిన టీమిండియా బౌలర్లు

9:55 pm, Fri, 17 January 20

రాజ్‌కోట్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇక్కడ జరిగిన రెండో వన్డేలో భారత్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం అయింది. దీంతో సిరీస్ ఫలితం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి షిప్ట్ అయింది. భారత్ నిర్దేశించిన 341 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే 304 పరుగులకు ఆలౌట్ అయింది.

స్మిత్, లబుషేన్‌లు క్రీజులో ఉన్నంత సేపూ భారత బౌలర్లను వణికించారు. మరోవైపు వికెట్ల కోసం టీమిండియా బౌలర్లు చెమటోడ్చారు. ఈ క్రమంలో 38వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీయడంతో భారత శిబిరంలో ఆశలు చిగురించాయి.

ఆ తర్వాత 44వ ఓవర్లో తొలి రెండు బంతుల్లోనూ రెండు వికెట్లు తీసిన మహ్మద్ షమీ ఆసీస్ విజయావకాశాలను దారుణంగా దెబ్బతీసి భారత్‌కు విజయాన్ని చేరువ చేశాడు. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌లో ఫించ్ 33, లబుషేన్ 46 పరుగులు చేయగా, స్టీవ్ స్మిత్ 2 పరుగుల తేడాతో శతకం చేజార్చుకున్నాడు.

భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా, సైనీ, జడేజా, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బుమ్రా ఒక వికెట్ తీశాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 42, కోహ్లీ 78 పరుగులు చేయగా, శిఖర్ ధవన్ నాలుగు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక, బ్యాటింగ్ ఆర్డర్‌లో వెనక్కి వచ్చిన లోకేశ్ రాహుల్ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 52 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 80 పరుగులు చేసి భారత్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.