టెస్టు సిరీస్‌లో భారత్ ఘోర పరాజయం.. కివీస్ క్లీన్ స్వీప్

- Advertisement -

క్రైస్ట్‌చర్చ్‌: ఇండియాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను ఆతిథ్య న్యూజిలాండ్‌ 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. రెండో టెస్టులో భారత్‌ నిర్దేశించిన 132 పరుగుల లక్ష్య సాధనలో బరిలోకి దిగిన కివీస్‌.. 36 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి, 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. లక్ష్యం చిన్నదైనప్పటికీ.. కివీస్‌ ఓపెనర్లు తేలికగా తీసుకోలేదు.

ఓపికగా ఆడుతూ.. స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ, వీలు చిక్కిప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఓపెనర్లు టామ్‌ లాథమ్‌( 74 బంతుల్లో 52: 10 ఫోర్లు), టామ్‌ బ్లండెల్‌(113 బంతుల్లో 55: 8 ఫోర్లు, 1 సిక్సర్‌) అర్ధసెంచరీలతో చెలరేగి, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

వీరిద్దరూ తొలి వికెట్‌కు 103 పరుగులు జోడించారు. దూకుడుగా ఆడిన లాథమ్‌.. ఉమేష్‌ వేసిన బంతిని ఫ్లిక్‌ చేయబోయి, కీపర్‌ పంత్‌కు దొరికిపోయాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ కేన్‌.. ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. 5 పరుగులకే అతడిని బుమ్రా పెవిలియన్‌ పంపించాడు.

అప్పటికే కివీస్‌ విజయం ఖాయమైంది. రాస్‌టేలర్‌(5 నాటౌట్‌), హెన్రీ నికోల్స్‌(5 నాటౌట్‌) లాంఛనాన్ని పూర్తి చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు తీయగా, ఉమేష్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. అంతకు ముందు ఓవర్‌నైట్‌ 96-6తో మూడో రోజు ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇండియా.. కేవలం 8 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసి.. 28పరుగులు మాత్రమే జోడించి, మిగితా వికెట్లను చేజార్చుకుంది. కివీస్‌ బౌలర్ల ధాటికి భారత బ్యాట్స్‌మెన్‌ క్రీజులో నిలవడానికి ఆపసోపాలు పడ్డారు.\

కివీస్‌ బౌలర్లలో బౌల్ట్‌ 4 వికెట్లతో చెలరేగగా.. సౌథీ 3 వికెట్లు పడగొట్టాడు. గ్రాండ్‌హోమ్‌, వాగ్నర్‌ తలో వికెట్‌ తీశారు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి, మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన కైల్‌ జెమీసన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. 14 వికెట్లు పడగొట్టిన కివీస్‌ బౌలర్‌ టిమ్‌ సౌథీ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచాడు.

కాగా, వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా.. కివీస్‌ టూర్‌కు ముందు అప్రతిహత విజయాలతో టాప్‌ ప్లేస్‌లో ఉన్న ఇండియా.. కివీస్‌తో జరిగిన రెండు టెస్టుల్లో ఘోర పరాభవం ఎదుర్కొంది. భారత్‌ అన్ని విభాగాల్లోనూ విఫలమైంది. ముఖ్యంగా బ్యాటింగ్‌ విభాగంలో కెప్టెన్‌ విరాట్‌ సహా మిగితా బ్యాట్స్‌మెన్‌ అంతా విఫలమయ్యారు.

ఒకరిద్దరు హాఫ్‌ సెంచరీలతో రాణించినా.. అది జట్టు విజయానికి ఉపయోగపడలేదు. బౌలర్లు సైతం వికెట్లు పడగొట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ మరోసారి అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన న్యూజిలాండ్‌ సిరీస్‌ విజయంతో పాటు, వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ ముందుకు ఎగబాకింది.

భారత్‌ సుదీర్ఘ న్యూజిలాండ్‌ పర్యటనలో 5 టీ-20 మ్యాచ్‌లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లాడగా.. తొలుత టీ-20 సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. అనంతరం జరిగిన వన్డే సిరీస్‌ను ఆతిథ్య కివీస్‌ 3-0తో, టెస్టు సిరీస్‌ను 2-0తో వైట్‌వాష్‌ చేసింది.

- Advertisement -