మరికాసేపట్లో భారత్-కివీస్ ఫైనల్ టీ20.. గెలిస్తే రికార్డే

12:14 pm, Sun, 2 February 20

మౌంట్ మౌంగనూయి: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. 5 మ్యాచ్‌ల టీ20 సీరీస్‌లో భాగంగా ఇప్పటికే 4-0 ఆధిక్యంతో కోహ్లీ సేన ముందంజలో ఉంది. నేడు ఇరు జట్ల మధ్య చివరి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను వైట్ వాష్ చేయాలని భారత్ చూస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు కాపాడుకోవాలని కివీస్ జట్టు పట్టుదలగా ఉంది. అయితే ఈ మ్యాచ్ లో కోహ్లీ సేన విజయం సాధిస్తే ప్రపంచ రికార్డు సొంతమవుతుంది.

న్యూజిలాండ్ బలమైన జట్టే అయినప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. కెప్టెన్ విలియమ్సన్ నాలుగో టీ 20కి దూరం కావడం ఆ జట్టును కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ మ్యాచ్‌కూ అతడు ఆడడం అనుమానమే. నాలుగో మ్యాచ్‌లో ఆడిన జట్టే ఈ మ్యాచ్‌లోనూ కొనసాగే అవకాశం ఉంది. కోలిన్ మన్రో, సీవర్ట్ మళ్లీ ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. సీనియర్లు రాస్ టేలర్, గప్తిల్, సౌథీ నుంచి ఆ జట్టు భారీగానే ఆశిస్తోంది.

ఇక, అన్ని విభాగాల్లోనూ భారత్ పటిష్టంగానే కనిపిస్తోంది. మొదటి రెండు మ్యాచుల్లో బ్యాటింగ్‌తో అదరగొట్టిన కోహ్లీ సేన ఆ తర్వాత రెండు మ్యాచుల్లో బౌలింగ్‌లో రాణించింది. అయితే ఈ మ్యాచ్ లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెప్టెన్ కోహ్లికి విశ్రాంతిని ఇచ్చి రోహిత్ కి కెప్టెన్సీ భాద్యతని అప్పగించే అవకాశం ఉంది. ఇక ఈ సిరీస్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని రిషభ్‌పంత్‌కు జట్టులో చోటు లభించనుంది. కుల్దీప్ యాదవ్‌కూ తుది జట్టులో చోటు దక్కొచ్చు. రాహుల్ , చాహల్‌కి విశ్రాంతి ఇవ్వనున్నారు.