ఐపీఎల్‌ సీజన్ 12లో ముగిసిన సన్ రైజర్స్ ప్రస్థానం! ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘనవిజయం…

5:59 am, Thu, 9 May 19
pant hitting

విశాఖ: ఐపీఎల్‌ సీజన్ 12లో సన్ రైజర్స్ కథ ముగిసిపోయింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ అద్భుతం చేసింది. ఐపీఎల్‌ 12వ సీజన్‌లో రెండో క్వాలిఫయర్‌కు ఢిల్లీ అర్హత సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్‌ పోరులో మొదటినుండి ఆధిపత్యం కొనసాగించి తిరుగులేని విజయం సాధించింది.

దీనితో క్వాలిఫైర్ మ్యాచ్ లో చెన్నైని ఢీకొట్టేందుకు సిద్ధమైంది. రిషభ్ పంత్‌ (49; 21 బంతుల్లో 2×4, 5×6), ఓపెనర్‌ పృథ్వీషా (56; 38 బంతుల్లో 6×4, 2×6) చెలరేగడంతో హైదరాబాద్‌ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని దిల్లీ 8 వికెట్లు నష్టపోయి, మరో బంతి మిగిలి ఉండగానే ఛేదించింది.

చెలరేగిన పృథ్వీ షా…

ఢిల్లీ ఛేదన మొదటినుండి ఆసక్తికరంగా సాగింది. పృథ్వీ షా అర్ధ శతకంతో చెలరేగడంతో 7 ఓవర్లకు 57 పరుగులు చేసింది. మరోవైపు శిఖర్‌ ధావన్‌ (17; 16 బంతుల్లో 3×4) మరోసారి భారీ ఇన్నింగ్స్‌ తో ఆకట్టుకోలేకపోయాడు. శ్రేయస్‌ అయ్యర్‌(8) సైతం విఫలమ్యాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన పంత్‌ ఆది నుంచి ఆచూతూచి ఆడాడు. అనువైన సమయం కోసం చూస్తూ , స్కోర్ బోర్డు ని పరుగుపెట్టించాడు.

మరోవైపు షా, మన్రో (14), అక్షర్‌ పటేల్‌ (0), రూథర్‌ఫర్డ్‌ ఔటైనా సహనం వహించాడు. అయితే రన్‌రేట్‌ మరీ తగ్గకుండా చూసుకున్నాడు. బాసిల్‌ థంపి వేసిన 18వ ఓవర్‌ మ్యాచ్ ని రైజర్స్ నుండి ఢిల్లీ లాగేసుకుంది. ఈ ఓవర్ లో పంత్‌ వరుసగా 4, 6, 4, 6తో చెలరేగాడు. దీంతో సమీకరణం 12 బంతుల్లో 12గా మారిపోయింది.

ఆ తరువాత భువి వేసిన 19వ ఓవర్లో రూథర్‌ఫర్డ్‌, పంత్‌ ఔటవ్వడంతో దిల్లీ చివరి 6 బంతుల్లో 5 పరుగులు చేయాల్సి వచ్చింది. ఖలీల్‌ వేసిన 19.4వ బంతికి అమిత్‌మిశ్రా అబ్‌స్ట్రక్టివ్‌ ఫీల్డ్‌ రూపంలో వెనుదిరగడంతో ఉత్కంఠ పెరిగింది. ఐదో బంతికి కీమోపాల్‌ బౌండరీ బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీనితో ఈ సీజన్ లో రైజర్స్ ప్రస్థానం ముగిసింది.