ఐపీఎల్ 2019: వరుసగా రెండో మ్యాచ్‌లోనూ.. ధోని సేన గెలుపు!

7:57 am, Wed, 27 March 19
csk vs dc
న్యూఢిల్లీ: ఐపీఎల్‌ తాజా సీజన్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు కఠిన పిచ్‌ ఎదురైంది. దీంతో స్వల్ప స్కోరే అయినా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆఖరి ఓవర్‌ వరకు సాగిన మ్యాచ్‌లో చెన్నై నిలకడగా ఆడి 6 వికెట్ల తేడాతో నెగ్గింది. గత లీగ్‌ నుంచి లెక్కిస్తే ఇది సీఎస్‌కేకు వరుసగా ఐదో విజయం.
 
బౌలింగ్‌లో డ్వేన్‌ బ్రావో (3/33) వణికించగా.. బ్యాటింగ్‌లో షేన్‌ వాట్సన్‌ (26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 44), రైనా (16 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 30) చెలరేగారు. ఆఖర్లో ధోనీ (32 నాటౌట్‌), జాదవ్‌ (27) జట్టు బాధ్యతను తీసుకున్నారు.
 
మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు సాధించింది. ధవన్‌ (47 బంతుల్లో 7 ఫోర్ల తో 51) అర్ధ సెంచరీ సాధించాడు. బ్రావోకు మూడు వికెట్లు దక్కాయి.
 
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 150 పరుగులు చేసి గెలిచింది. అమిత్‌ మిశ్రాకు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా వాట్సన్‌ నిలిచాడు.
 
అయితేనేం.. మరో ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌, సురేశ్‌ రైనా ధాటికి స్కోరుబోర్డు ఉరకలెత్తింది. కానీ మధ్య ఓవర్లలో స్కోరు మందగించగా అటు ధోనీ, జాదవ్‌ నిదానం కనబరిచారు. అంతకముందు రెండో ఓవర్‌లోనే రెండు ఫోర్లు బాదిన వాట్సన్‌ నాలుగో ఓవర్‌లో 4,6తో బ్యాట్‌కు పనిచెప్పాడు.
 
ఇక ఆ తర్వాత ఓవర్‌లో రైనా వరుసగా మూడు ఫోర్లు బాది 18 పరుగులు రాబట్టాడు. అమిత్‌ మిశ్రా వేసిన ఏడో ఓవర్‌లో వాట్సన్‌ రెండు సిక్సర్లతో రెచ్చిపోయినా పంత్‌ మెరుపు స్టంపింగ్‌తో అవుటయ్యాడు. రెండో వికెట్‌కు 24 బంతుల్లోనే 52 పరుగులు జత చేరాయి.
 
ఈ దశలో జాదవ్‌తో కలిసి రైనా చెలరేగాడు. పదో ఓవర్‌లో రైనా సిక్స్‌, జాద వ్‌ ఫోర్‌ బాదగా జట్టు స్కోరు 97/2గా ఉంది. ఈ దశలో మరుసటి ఓవర్‌లోనే అమిత్‌ మిశ్రా.. రైనా వికెట్‌ తీశా డు. అటు వికెట్‌ కూడా స్లోగా మారడంతో జాద వ్‌, ధోనీ జాగ్రత్తగా ఆడు తూ సింగిల్స్‌పైనే దృష్టి సారించారు. 17వ ఓవర్‌లో అక్షర్‌ ఒక్క రన్‌ మాత్రమే ఇచ్చాడు.
 

ధోనీ తనదైన శైలిలో…

 
12 బంతుల్లో 11 పరుగులు రావాల్సి ఉండగా 19వ ఓవర్‌లో ధోనీ తనదైన శైలిలో భారీ సిక్సర్‌ బాదాడు. ఇక చివరి ఓవర్‌ తొలి బంతికి జాదవ్‌ అవుట్‌ కాగా వరుసగా రెండు బంతులను బ్రావో వదిలేసి ఉత్కంఠ పెంచా డు. కానీ మూడో బంతిని బౌండరీగా మలిచి గట్టెక్కించాడు.

ధవన్‌ దూకుడు.. బ్రావో కట్టడి… 

టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ అంతా తానై నడిపించాడు. అతడికి మరో ఓపెనర్‌ పృథ్వీ షా (24), రిషభ్‌ పంత్‌ (25) కొద్దిసేపు సహకరించారు. వీరి ధాటికి ఓ దశలో స్కోరు 170 పరుగుల వరకు వెళుతుందనిపించింది. అయితే తొలి 15 ఓవర్లలో 118/2తో పటిష్ఠంగా ఉన్న జట్టు చివరి ఐదు ఓవర్లలో కేవలం 29 పరుగులు మాత్రమే చేయగలిగింది.
 
బ్యాటింగ్‌కు కష్టంగా మారిన పిచ్‌పై ఏడు పరుగుల తేడాతోనే నాలుగు వికెట్లను కోల్పోయింది. డ్వేన్‌ బ్రావో మిడిలార్డర్‌ను కుప్పకూల్చాడు. ఆరంభంలో రెండో ఓవర్‌లోనే హ్యాట్రిక్‌ ఫోర్లతో రెచ్చిపోయిన పృథ్వీ షాను ఐదో ఓవర్‌లో దీపక్‌ చాహర్‌ అవుట్‌ చేశాడు.
 
దీంతో 36 పరుగుల వద్ద ఢిల్లీ తొలి వికెట్‌ కోల్పోయింది. ఆతర్వాత నాలుగు ఓవర్ల పాటు పరుగుల వేగం తగ్గింది. తాహిర్‌ వేసిన 12వ ఓవర్‌లో ధవన్‌ వరుసగా రెండు ఫోర్లతో జోరు చూపించగా నాలుగో బంతికి కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ (18) ఎల్బీ అయ్యాడు. రెండో వికెట్‌కు వీరు 43 పరుగులు జత చేశారు. ఈ దశలో ధవన్‌కు యువ సంచలనం రిషభ్‌ పంత్‌ తోడయ్యాడు.
 
భారీ అంచనాలతో బరిలోకి దిగిన పంత్‌ తానెదుర్కొన్న రెండో బంతినే బౌండరీగా మలిచాడు. అటు ధవన్‌ వరుస ఫోర్లతో విరుచుకుపడగా భారీ స్కోరు ఖాయమే అనిపించింది. కానీ డ్వేన్‌ బ్రావో 16వ ఓవర్‌లో పంత్‌, ఇన్‌గ్రామ్‌ (2)ను పెవిలియన్‌కు చేర్చగా అర్ధ సెంచరీతో జోరు మీదున్న ధవన్‌ను మరుసటి ఓవర్‌లోనే అవుట్‌ చేశాడు. దీంతో జట్టు ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది.