క్వాలిఫైయర్-2: గెలిచేదెవరు….? ఫైనల్‌లో నిలిచేదెవరు?

7:30 am, Fri, 10 May 19

విశాఖపట్నం: ఐపీఎల్ చివరి అంకానికి మరో అడుగు దూరంలో ఉంది. ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌ను చిత్తు చేసిన ఢిల్లీ….సొంతగడ్డపై క్వాలిఫయర్-1లో ముంబై చేతిలో ఓడిన చెన్నై…..క్వాలిఫైయర్-2లో తలపడనున్నాయి.

ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్‌లో ముంబై జట్టుని ఢీకొంటుంది. ఇక విశాఖ తీరంలో జరిగే ఈ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో గెలిచి సత్తా చాటాలని…అటు ధోనీ సారథ్యంలోని చెన్నై, ఇటు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఢిల్లీ చూస్తున్నాయి.

చదవండి: ఐపీఎల్‌ సీజన్ 12లో ముగిసిన సన్ రైజర్స్ ప్రస్థానం! ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘనవిజయం…

జట్ల బలాబలాలు…

కెప్టెన్ ధోనీనే చెన్నైకు కొండంత అండ. అతడు వికెట్ల వెనుక ఉండి…మ్యాచ్ వ్యూహాలని రచిస్తూ…ప్రత్యర్ధులని కట్టడి చేయగల ధిట్ట. ఇక ఓపెనర్లు వాట్సన్, డుప్లెసిస్ ఫామ్‌లోకి రావాలి. రైనా, రాయుడు కూడా అంతగా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయడం లేదు. కాబట్టి ఈ మ్యాచ్‌లో వాళ్ళు రాణించాలి.

ఇక బౌలింగ్‌లో సూపర్‌కింగ్స్‌కు తిరుగులేదు. తాహిర్, హర్భజన్, జడేజాతో స్పిన్ త్రయం బలంగా కనిపిస్తుంటే.. యంగ్ పేసర్ దీపక్ చహర్ బాగానే రాణిస్తున్నాడు.

ఢిల్లీ యంగ్ తరంగ్…

ఢిల్లీ యువ ఆటగాళ్లతో బలంగా ఉంది. పృథ్వీ షాతో కలిసి సీనియర్ ఓపెనర్ శిఖర్ ధవన్ జట్టుకు శుభారంభాలు అందిస్తున్నాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, మున్రో లతో మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్‌గా ఉంది. బౌలింగ్ కూడా బలంగానే ఉంది.

బౌల్ట్, ఇషాంత్‌లు మంచి స్వింగ్‌లో ఉన్నారు. కీమో పాల్ బౌలింగ్‌లో ఫర్వాలేదనిపిస్తున్నాడు. వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా అంచనాలకి తగ్గటూగానే రాణిస్తున్నాడు. అటు అక్షర్ కూడా బౌలింగ్, బ్యాటింగ్, పీల్డింగ్‌లో జట్టుకు ఉపయోగపడుతున్నాడు. చూద్దాం మరి సీనియర్లు ఉన్న చెన్నై గెలుస్తుందో లేక..జూనియర్ల ఢిల్లీ సత్తా చాటుతుందో….

జట్లు (అంచనా)

చెన్నై: ధోనీ(కెప్టెన్), వాట్సన్, డుప్లెసిస్, రైనా, రాయుడు, విజయ్, జడేజా, బ్రేవో, చహర్, తాహిర్, హర్భజన్.

ఢిల్లీ: అయ్యర్(కెప్టెన్), పృథ్వీ షా, ధవన్, ఇంగ్రామ్/మున్రో, పంత్, అక్షర్, రూథర్‌ఫోర్డ్, పాల్, మిశ్రా, బౌల్ట్, ఇషాంత్.

చదవండి: ఆకట్టుకునే ఫీచర్లతో హువావే, రియల్ మీ కొత్త ఫోన్లు…