ప్లే ఆఫ్ లో సన్‌రైజర్స్! కీలక మ్యాచ్ లో చేతులెత్తేసిన కేకేఆర్!

8:02 am, Mon, 6 May 19
SRH

హైదరాబాద్: ఐపీఎల్‌ 2019 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ లక్కీగా ప్లేఆఫ్ బెర్తుని దక్కించుకుంది. లీగ్ దశలో 14 మ్యాచ్‌లాడి కేవలం ఆరింట్లో మాత్రమే గెలుపొందిన హైదరాబాద్ టీమ్.. 12 పాయింట్లతో ప్లేఆఫ్‌కి చేరిన తొలి జట్టుగా ఐపీఎల్‌లో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది.

సన్‌రైజర్స్‌తో పాటు ప్లేఆఫ్ చేరిన ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 14 మ్యాచ్‌ల్లో ఏకంగా 9 మ్యాచ్‌ల్లో గెలుపొంది 18 పాయింట్లతో ప్లేఆఫ్‌కి చేరడం విశేషం.

వాస్తవానికి టోర్నీలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (+0.028), కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (-0.251) జట్లు కూడా 12 పాయింట్లు సాధించాయి. కానీ.. వాటితో పోలిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ (+0.577)కి నెట్‌ రన్‌రేట్‌ అధికంగా ఉండటంతో ప్లేఆఫ్ ఛాన్స్ దక్కింది. ప్లేఆఫ్‌కి చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబయితో ఆదివారం ఢీకొన్న కోల్‌కతా జట్టు 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడటం హైదరాబాద్‌కి కలిసొచ్చింది.

2016 ఐపీఎల్ విజేతగా నిలిచిన హైదరాబాద్.. 2018‌ సీజన్‌ ఫైనల్లో చెన్నై చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2019 సీజన్ ప్లేఆఫ్‌లో భాగంగా తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మంగళవారం రాత్రి చెపాక్ వేదికగా ఢీకొనున్నాయి.

ఆ తర్వాత వైజాగ్‌‌లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య బుధవారం రాత్రి ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇక రెండో క్యాలిఫయర్ మ్యాచ్‌‌కి కూడా వైజాగే శుక్రవారం ఆతిథ్యమివ్వనుండగా.. ఆదివారం ఫైనల్ మ్యాచ్ ఉప్పల్‌లో జరగనుంది.