ఐపీఎల్‌కూ కరోనా గాలి.. టోర్నీ నిర్వహణపై సందిగ్ధం

8:12 pm, Wed, 4 March 20

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 (కరోనా వైరస్) కారణంగా ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ఏడాది జరగాల్సిన ప్రపంచ క్రీడా పండుగ ఒలింపిక్స్ వాయిదా పడే అవకాశం కనిపిస్తుండగా, ఇప్పుడు ఐపీఎల్‌ను కూడా వాయిదా వేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

భారత్‌ వేదికగా ఈ నెల 29న ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 13వ సీజన్‌పై కూడా కరోనా వైరస్‌ ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. అయితే, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపడేశాడు. ఐపీఎల్ నిర్వహణకు ఎటువంటి ఇబ్బంది లేదని తేల్చి చెప్పాడు.

ఈ నెల 12న దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని గంగూలీ చెప్పాడు. అసలు ఆ అంశం గురించి సమావేశంలో చర్చించలేదని పేర్కొన్నాడు.

ప్రస్తుతానికి వైరస్‌ వల్ల ఎలాంటి ముప్పు లేదని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని ఐపీఎల్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ వివరించాడు. కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందన్నాడు.

మార్చి 12 నుంచి ధర్మశాల వేదికగా భారత్‌, సౌతాఫ్రికా మధ్య తొలి వన్డే జరగనుంది. కరోనా వైరస్‌ కేసుల గురించి బీసీసీఐ పర్యవేక్షిస్తోందని దాదా తెలిపాడు.

షెడ్యూల్‌ ప్రకారమే సౌతాఫ్రికా భారత్‌లో పర్యటిస్తుందని, ఐపీఎల్‌ కూడా నిర్వహిస్తామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.