మరో మూడు రికార్డులపై కన్నేసిన కోహ్లీ

2:59 pm, Sat, 23 March 19
Captain Virat Kohli Latest News, IPL Latest News, Cricket Latest News, Newsxpressonline

చెన్నై: ఐపీఎల్‌ 12వ సీజన్‌ కోసం యావత్‌ క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు మొదటి మ్యాచుకు సన్నద్ధమయ్యాయి. కాగా ప్రపంచక్రికెట్‌లో ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ ఈరోజు చెన్నైతో మ్యాచ్‌లో ఒకేసారి మూడు రికార్డులపై కన్నేశాడు.

ఐపీఎల్లో అత్యధిక పరుగులు: ఇప్పటివరకూ ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు సురేశ్‌రైనా మొదటిస్థానంలో ఉన్నాడు. 176 మ్యాచుల్లో 4985 పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగుతుండగా రాయల్‌ ఛాలెంజర్స్ కెప్టెన్‌ కోహ్లీ 163 మ్యాచుల్లో 4948 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. మరో 38 పరుగులు చేస్తే రైనాను దాటి ముందుకు దూసుకుపోతాడు.

ఐదు వేల పరుగులు : అలాగే 52 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో ఐదు వేల పరుగులు పూర్తిచేసిన మొదటి ఆటగాడిగా కోహ్లీ చరిత్రలో నిలిచిపోతాడు. మరోవైపు రైనా సైతం మరో 15 పరుగులు చేస్తే ఐదు వేల పరుగులకు చేరుకుంటాడు.

అత్యధిక అర్ధ శతకాలు: ఈ నేపథ్యంలోనే ఐపీఎల్‌లో అత్యధిక అర్ధశతకాలు చేసిన క్రికెటర్‌గా కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో అర్ధశతకం బాదితే.. ఇప్పటికే ఐపీఎల్‌లో 39 అర్ధశతకాలు బాదిన డేవిడ్‌ వార్నర్‌ చెంతన చేరతాడు. దీంతో చెన్నైతో జరిగే తొలి మ్యాచ్‌లో కోహ్లీ మొత్తంగా 52 పరుగులు చేస్తే, ఒకేసారి మూడు రికార్డులు తన ఖాతాలో వేసుకుంటాడు.

గత ఆరు సీజన్ల నుంచి కోహ్లీ రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టుకి నాయకత్వం వహించగా ఇప్పటివరకూ ఆ జట్టు ఒక్కసారి కూడా ఐపీఎల్‌ విజేతగా నిలవలేదు. 2016లో అతడి అద్భుత బ్యాటింగ్‌, సారథ్యంలో ఫైనల్‌కి చేరినా టైటిల్‌ గెలవలేదు. ఆ సీజన్‌లో మొత్తం 973 పరుగులు చేసి కోహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కాగా ఇటీవల ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పర్యటనల్లో టీమిండియాకి చారిత్రక విజయాలు అందించిన కోహ్లీ ఈసారి బెంగళూరుకు ఐపీఎల్‌ కప్పును కూడా అందించాలనే కసితో ఉన్నాడు.