ఎట్టకేలకు బోణీ కొట్టిన బెంగళూరు! రాణించిన కోహ్లీ, డివిల్లియర్స్!

9:58 am, Sun, 14 April 19
rcb won the match

ఐపీయల్: వరుసగా ఆరు పరాజయాల తర్వాత బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ఎట్టకేలకు తొలి విజయం దక్కింది. డబుల్ హ్యాట్రిక్ పరాజయాలతో తీవ్ర విమర్శలపాలైన విరాట్ సేన, ఎట్టకేలకు ఏడో మ్యాచ్‌లో మొట్టమొదటి విజయాన్ని రుచి చూసింది. 174 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 19.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

విరాట్ కోహ్లీతో పాటు డివిల్లియర్స్ హాఫ్ సెంచరీలతో రాణించి, బెంగళూరు తొలి విక్టరీని అందించారు. పార్థివ్ పటేల్ 19 పరుగులు చేసి అవుట్ కాగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 8 ఫోర్లతో 67 పరుగులు చేసి, షమీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 59 పరుగులు చేసిన డివిల్లియర్స్, స్టోయినిస్ 28 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

అంతకుముందు టాస్ ఓడి, బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 173 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ హిట్టర్ క్రిస్‌గేల్ నిలదొక్కుకోవడానికి కొద్ది సమయం తీసుకోవడంతో నెమ్మదిగా ఇన్నింగ్స్ మొదలెట్టింది పంజాబ్. మొదటి ఓవర్‌ వేసిన ఉమేశ్ యాదవ్, కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు.

ఆ తర్వాతి ఓవర్‌లోనూ గేల్ నెమ్మదిగా ఆడడంతో రెండు ఓవర్లలో కేవలం 7 పరుగులు మాత్రమే చేయగలిగింది పంజాబ్. అయితే మూడో ఓవర్ నుంచి దూకుడు మొదలెట్టిన క్రిస్‌గేల్. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఫోర్, సిక్స్ రాబట్టి వేగం పెంచాడు. మొదటి వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత రాహుల్ అవుట్ అయ్యాడు. 15 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్స్‌తో 18 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, చాహాల్ బౌలింగ్‌లో ముందుకొచ్చి, స్టంపౌట్ అయ్యాడు.

ఆ తర్వాత మయాంక్ అగర్వాల్ కూడా 15 పరుగులు చేసి చాహాల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కొద్దిసేపటికే సర్ఫరాజ్ ఖాన్ 15 పరుగులు, శామ్ కర్రాన్ ఒక్క పరుగు చేసి అవుట్ కావడంతో వరుస వికెట్లు కోల్పోయింది పంజాబ్ జట్టు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా, క్రిస్ గేల్ మాత్రం దూకుడు తగ్గించలేదు. వరుస బౌండరీలు సాధిస్తూ, స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

చివరిదాకా క్రీజులో నిలిచేందుకే ప్రాధాన్యం ఇచ్చిన గేల్… అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో గేల్ వికెట్లు ముందు దొరికిపోయినా, అంపైర్లు నాటౌట్‌గా ప్రకటించారు. ఇంతకుముందు మ్యాచుల్లో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా విరాట్ కోహ్లీ రివ్యూ తీసుకోలేదు. దానికి భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది బెంగళూరు జట్టు.

మన్‌దీప్ 16 బంతుల్లో 18 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 64 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 99 పరుగులు సాధించిన గేల్… ఒక్క పరుగుతో సెంచరీ మిస్ అయ్యాడు. ఐపీఎల్‌లో 99 పరుగులతో నాటౌట్‌గా ఉండి, సెంచరీ మిస్ అయిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు గేల్. ఇంతకుముందు సురేశ్ రైనా ఈ ఫీట్ సాధించాడు.