దేవుడా.. దేవుడా.. బెంగళూరును గెలిపించవా?.. ఆర్సీబీ అభిమానుల వేడుకోలు

2:35 pm, Sat, 13 April 19
Virat Kohli Latest News, IPL Latest News, Cricket Match News, Newsxpressonline

మొహాలీ: ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత దురదృష్టకరమైన జట్టు ఏదైనా ఉందంటే అది ఒక్క రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాత్రమే. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచుల్లోనూ పరాజయం పాలైన కోహ్లీ సేనకు నేడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగే మ్యాచ్ అత్యంత కీలకం కానుంది.

ఈ నేపథ్యంలో బెంగళూరుకు ఇక దేవుడే దిక్కని ఓ అభిప్రాయానికి వచ్చిన అభిమానులు ఈ ఒక్కమ్యాచ్‌లోనైనా గెలిపించాలని వేడుకుంటున్నారు. మరోవైపు, ఐపీఎల్ బరిలో నిలవాలంటే నేటి మ్యాచ్‌లో నెగ్గడం తప్ప ఆర్సీబీకి మరో మార్గం లేదు. చావోరేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి రేసులో నిలవాలని కెప్టెన్ కోహ్లీ గట్టి పట్టుదలతో ఉన్నాడు.

ఈ సీజన్ ఆరంభం నుంచి బెంగళూరు జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో రంగాల్లో పూర్తిగా విఫలమవుతూ వస్తోంది. రెండు మూడు మ్యాచ్‌ల్లో కోహ్లీ, డివిలియర్స్, పార్థివ్ పటేల్ మెరిసినా సహచర ఆటగాళ్ల నుంచి సరైన సహకారం లేకపోవడంతో జట్టు ఓటమిని అలవాటుగా మార్చుకుంది.

ఇక ఆర్సీబీ బౌలింగ్‌ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చాహల్ పరవాలేదనిపిస్తున్నా.. ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, నవదీప్ షైనీ విపరీతంగా పరుగులు సమర్పించేసుకుంటున్నారు. 205 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోతున్నారంటే బెంగళూరు బౌలర్ల ప్రదర్శన ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

నేటి మ్యాచ్‌లో భారీ మార్పులతో బరిలోకి దిగాలని కోహ్లీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లోనూ మార్పులు చేయాలని కోహ్లీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. పంజాబ్ జట్టులో హిట్టర్లు ఉండడంతో తొలుత బ్యాటింగ్ చేస్తే భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచాలని, బౌలింగ్ చేస్తే ప్రత్యర్థిని తక్కువకే కట్టడి చేయాలని కోహ్లీ యోచిస్తున్నాడు.

ఇక, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో ఓపెనర్ క్రిస్‌గేల్ మెరుపులు మెరిపిస్తున్నా భారీ స్కోరు చేయడంలో విఫలమవుతున్నాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇటీవల సెంచరీ బాది మళ్లీ ఫాంలోకి వచ్చాడు. మిడిలార్డర్‌లో మయాంక్ అగర్వాల్, మన్‌దీప్ సింగ్, డేవిడ్ మిల్లర్, సర్ఫరాజ్ ఖాన్‌లు బ్యాటింగ్‌ భారాన్ని మోస్తుండగా.. మహ్మద్ షమీ, అశ్విన్, ముజీబ్, శాం కరన్ బౌలింగ్‌లో జట్టును ఆదుకుంటున్నారు.

చదవండి: ఎయిర్‌పోర్టులో నేలపైనే నిద్రపోయిన ధోనీ, సాక్షి! వైరల్ అవుతోన్న ఫోటో..